దైవం రూపేణా! | - | Sakshi
Sakshi News home page

దైవం రూపేణా!

Jun 14 2026 7:22 AM | Updated on Jun 14 2026 7:22 AM

రక్తదానంతో ప్రాణదానం ఒక యూనిట్‌ బ్లడ్‌తో పలువురికి జీవం జిల్లాలో పెరిగిన స్వచ్ఛంద దాతలు బ్లడ్‌బ్యాంకుల్లో సమృద్ధిగా నిల్వలు నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం

ప్రమాదంలో తీవ్రంగా గాయపడినవారు.. ప్రసవ సమయంలో అధిక రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన మహిళలు.. తలసేమియాతో ప్రతి నెలా రక్తం కోసం ఆస్పత్రి చుట్టూ ప్రదక్షిణలు చేసే పిల్లలు.. వీరందరి చివరి ఆశ రక్తదాతలే. మానవత్వానికి ప్రతీకగా నిలిచే రక్తదానం ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ప్రపంచంలో మనిషిని మరో మనిషి మాత్రమే కాపాడగలడని నిరూపిస్తోంది. అందుకే రక్తదానం మహోన్నమైందిగా అభివర్ణిస్తుంటారు. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం.

కాణిపాకం : చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వా స్పత్రిలో ఉన్న రక్తనిధి కేంద్రం వేలాది మంది రోగులకు ప్రాణాధారంగా నిలుస్తోంది. ప్రమాద బాధితులు, గుండె ఆపరేషన్లు,, క్యాన్సర్‌ చికిత్సలు, ప్రసవాలు, రక్తహీనత, తలసేమియా వంటి అనేక సందర్భాల్లో బ్లడ్‌ అత్యవసరంగా కావాల్సివస్తుంది. ఈ అవసరాలను తీర్చడంలో స్వచ్ఛంద రక్తదాతల పాత్ర అత్యంత కీలకంగా మారింది. సాధారణంగా జిల్లా ప్రభుత్వాస్పత్రి బ్లడ్‌బ్యాంకులో 50 నుంచి 200 యూనిట్ల వరకు రక్త నిల్వలు ఉంటాయి. ప్రస్తుతం సుమారు 100 యూనిట్ల రక్తం అందుబాటులో ఉంది. అవసరాలకు అనుగుణంగా నిల్వల ను నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు కొత్తగా రక్త సేకరణ చేపడుతున్నారు. 2025లో జిల్లా ప్రభుత్వాస్పత్రి బ్లడ్‌ బ్యాంకు ద్వారా 3,648 యూనిట్ల రక్తం సేకరించారు. అదే సమయంలో 3,198 యూనిట్లను అవసరమైన రోగులకు అందజేశారు. ఈ గణాంకాలే జిల్లాలో రక్తదాతల సేవా స్పూర్తిని తేటతెల్లం చేస్తున్నాయి.

యువతలో పెరిగిన సేవాభావం

కొన్నేళ్లుగా జిల్లాలో యువత రక్తదాన శిబిరాల్లో చురుగ్గా పాల్గొంటోంది. సుమారు 15 నుంచి 20 మంది యువకులు వివిధ స్వచ్ఛంద సంస్థలు, సేవా సంఘాల ఆధ్వర్యంలో తరచూ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. పుట్టినరోజులు, జయంతు లు, వర్ధంతులు వంటి సందర్భాల్లో క్యాంపులను ఏర్పాటు చేసి మరింత మందిని దాతలుగా మార్చేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలో రక్త కొరత సమస్య గణనీయంగా తగ్గిందని వైద్యులు వెల్లడిస్తున్నారు. అత్యవసర సమయంలో ఒక్క ఫోన్‌న్‌ కాల్‌ చేస్తే రక్తదానానికి ముందుకొచ్చే దాతల సంఖ్య కూడా పెరుగుతుండడం విశేషం.

ఈ గ్రూపులకు డిమాండ్‌

జిల్లాలో అత్యధికంగా బీ పాజిటివ్‌, ఓ పాజిటివ్‌, ఏ పాజిటివ్‌ రక్త గ్రూపులకు డిమాండ్‌ ఉంటోంది. ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, ఇతర వైద్య సేవలకు ఈ గ్రూపుల రక్తం తరచూ అవసరమవుతోంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఏబీ పాజిటివ్‌ రక్తానికి సైతం డిమాండ్‌ పెరుగుతోంది. ఓ పాజిటివ్‌, బీ పాజిటివ్‌ గ్రూపులకు చెందిన దాతలు ఎక్కువగా ఉండడంతో వీటి నిల్వలు సాధారణంగా అందుబాటులో ఉంటాయి. అయితే అవసరాలు పెరిగినప్పుడు కొత్త దాతల నుంచి సేకరణ చేపడుతున్నారు. రక్తదానం చేసిన వెంటనే దాన్ని రోగులకు ఇవ్వరు. వివిధ రకాల పరీక్షలు నిర్వహించి, వైరల్‌ ఇన్ఫెక్షన్లు లేవని ముందుగా నిర్ధారిస్తారు. అనంతరం ప్రత్యేక కోల్డ్‌ స్టోరేజ్‌ యూనిట్లలో నిర్దిష్ట ఉష్ణోగ్రతలో భద్రపరుస్తారు. ఇక తలసేమియా వ్యాధితో బాధపడే పిల్లలకు తరచూ రక్త మార్పిడి అవసరమవుతుంది. రక్తం అందకపోతే ప్రమాదం. ఈ నేపథ్యంలో జిల్లా రక్తనిధి కేంద్రం వారు తలసేమియా బాధితులకు సుమారు 10 శాతం వరకు ఉచితంగానే బ్లడ్‌ అందిస్తున్నారు.

జిల్లా ఆస్పత్రి బ్లడ్‌ బ్యాంకు

రక్త సేకరణ వివరాలు

సంవత్సరం సేకరించిన యూనిట్లు

2021 1,562

2022 3,127

2023 2,548

2024 2,509

2025 3,468

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement