ఆరుగాల కష్టం.. కళ్లెదుటే నష్టం! | - | Sakshi
Sakshi News home page

ఆరుగాల కష్టం.. కళ్లెదుటే నష్టం!

Jun 14 2026 7:22 AM | Updated on Jun 14 2026 7:22 AM

● తోటల్లోనే తోతాపురి ● కొనుగోళ్లు లేక కోతలకు బ్రేక్‌ ● పండు ఈగ దాడితో దెబ్బతింటున్న మామిడి ● ఫ్యాక్టరీల సిండికేట్‌తో రైతుల ఇక్కట్లు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): జిల్లాలో సుమారు 59 వేల హెక్టార్లలో మామిడి సాగు చేపట్టారు., అందులో 41 వేల హెక్టార్లలో తోతాపురి రకం సాగు చేశారు. ఈ సీజన్‌న్‌లో సుమారు 6 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అయితే ఇప్పటి వరకు కేవలం లక్ష మెట్రిక్‌ టన్నులు మాత్రమే ప్రాసెసింగ్‌ ఫ్యాక్టరీలకు తరలించినట్లు రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. ఇంకా ఐదు లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా కాయలు తోటల్లోనే ఉండడంతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది.

కుళ్లిపోతున్న కాయలు

వాతావరణ మార్పులు, తేమ అధికంగా ఉండడంతో పండు ఈగ దాడి తీవ్రంగా పెరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాయల్లో పురుగులు చేరడంతో కుళ్లిపోతున్నాయని వాపోతున్నారు. దీంతో కాయలు భారీగా రాలిపోతున్నాయి. ఇప్పటికే పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో ఈ నష్టం రైతులను మరింత కుంగదీస్తోంది. కొన్ని ప్రాంతాల్లో రైతులు తోటలలో పాడైపోయిన కాయలను సేకరించి తొలగించుకుంటున్నారు.

నిలిచిన కోతలు

పంట సిద్ధంగా ఉన్నప్పటికీ కొనుగోలు చేసేందుకు ఫ్యాక్టరీలు ముందుకు రావడం లేదు. దీంతో రైతులు కోతలు నిలిపివేస్తున్నారు. ఎక్కడ విక్రయించాలో తెలియక తోటల్లోనే కాయలను ఉంచుతున్నారు. దీంతో పంట నాణ్యత దెబ్బతింటోందని, కాయలు రాలిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ర్యాంపులకు తోలితే వారంలో డబ్బులు చేతిలో పెడతారని...చాలా మంది రైతులు కేజీ రూ.4లకే విక్రయిస్తున్నారు.

ప్రభుత్వం పట్టించుకోవాలి

జిల్లాలో లక్షలాది టన్నుల తోతాపురి పంట ఇంకా తోటల్లోనే ఉండడంతో ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలని రైతులు స్పష్టం చేస్తున్నారు. అన్ని ప్రాసెసింగ్‌ ఫ్యాక్టరీలను పూర్తి స్థాయిలో పనిచేయించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రధానంగా పండు ఈగ నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు, గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని కోరుతున్నారు.

జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటికే మార్కెట్‌ అనిశ్చితి కారణంగా దిక్కుతోచని దుస్థితి దాపురించింది. సిండికేట్‌గా మారిన గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలతో వేగలేక తలబొప్పి కడుతోంది. కొనుగోళ్లు లేక లక్షల టన్నుల తోతాపురి తోటల్లోనే నిలిచిపోయింది. ఇదే అదునుగా పండు ఈగ రూపంలో పెనుముప్పు ఎదురవుతోంది. కాయ నాణ్యత పూర్తిగా దెబ్బతింటోంది. అలాగే వేలాది టన్నుల మామిడి నేలరాలిపోతోంది. ఇటు కొనేవాళ్లు రాక.. అటు కాయలను కాపాడుకోలేక రైతాంగం తీవ్రంగా ఆందోళన చెందుతోంది.

ఫ్యాక్టరీల వద్ద అవస్థలు

అరకొరగా తెరుచుకున్న ఫ్యాక్టరీల వద్ద పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మూడు రోజులకోసారి మాత్రమే టోకెన్లు ఇస్తున్నారు. టోకెన్‌న్‌ వచ్చిన తర్వాత కూడా అన్‌న్‌లోడింగ్‌కు రెండు నుంచి మూడు రోజులు పడుతోంది. గంగాధరనెల్లూరు మండలంలోని ఓ ఫ్యాక్టరీ వద్ద మామిడి కాయలతో వచ్చిన ట్రాక్టర్లు సుమారు రెండు కిలో మీటర్ల మేర బారులుతీరాయి. గుడిపాల మండలంలోని ఓ ఫ్యాక్టరీ వద్ద లారీలు అధిక సంఖ్యలో కనిపిస్తున్నాయి. అవి కూడా తమిళనాడుకు చెందిన బండ్లు కావడం గమనార్హం. సరిహద్దులోని మరో ఫ్యాక్టరీ సిఫార్సుల కాయలను మాత్రమే తీసుకుంటోంది. సామాన్య రైతులకు అరకొరగా టోకెన్లు పంచిపెడుతోంది. దీంతో రవాణా ఖర్చులు రైతులకు తడిసి మోపెడవుతున్నాయి. ఫ్యాక్టరీలు, మధ్యవర్తుల సిండికేట్‌ కారణంగా రైతులకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement