శ్రీరంగరాజపురం : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు సంబంధించి వారి కుటుంబాలకు చంద్రబాబు ప్రభుత్వం న్యాయం చేయలేదని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మండిపడ్డారు. శనివారం ఆయన మాట్లాడుతూ దౌర్జన్యాలు, దాడులు, అక్రమ కేసులపై ఉన్న శ్రద్ధ స్టీల్‌ప్లాంట్ కార్మికులపై లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమా దం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించలేదని, కార్మికులకు అండగా ఉండకపోగా అపహేళన చేస్తూ మాట్లాడారని విమర్శించారు. బాధిత కుటుంబాలకు ఇప్పటి వరకు ఆర్థికసాయం ప్రకటించలేదని, చట్ట ప్రకారం కార్మికుల రావాల్సిన నిధులనే తాము ఇస్తున్నట్లు డబ్బా కొట్టుకుంటున్నారని స్పష్టం చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో మృతులకు రూ.కోటి చొప్పున పరిహారం అందించారని వెల్లడించారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే శుక్రవారం రాత్రి కూడా రెండు ప్రమాదాలు సంభవించాయని ఆరోపించారు. దీంతో స్టీల్‌ప్లాంటు కార్మికుల్లో అభద్రతాభావం ఏర్పడుతోందని తెలిపారు. కార్మికులకు న్యాయం జరిగేంతవరకు వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
నిత్యాన్నదానానికి విరాళం
కాణిపాకం : కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో నిత్యాన్నదానానికి శనివారం మచిలీపట్నానికి చెందిన దాత హరికృష్ణ రూ.1,00,116 విరాళం అందించారు. కుటుంబసమేతంగా వచ్చిన దాతకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి శేషవస్త్ర, చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు.


