చిత్తూరు కలెక్టరేట్ : పిల్లలు ఇంట్లో ఉంటే అస్సలు చదవడం లేదు. నిరంతరం స్మార్ట్‌ఫోన్లతోనే బతికేస్తున్నారు. మా మాట వినడం లేదు. ఇవి సగటు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి తల్లిదండ్రుల ఆవేదన. పిల్లలపై ఎంత ప్రేమ ఉన్నప్పటికీ, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గుండెను రాయి చేసుకుని మరీ దూర ప్రాంతాల్లోని ప్రైవేటు, కార్పొరేట్ రెసిడెన్షియల్ పాఠశాలలకు పంపుతున్నారు. ఈ క్రమంలోనే 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభమైన తొలి రోజుల్లోనే జిల్లాలోని ప్రైవేట్ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు విద్యార్థులతో కిక్కిరిసిపోతున్నాయి.
కంటికి దూరమైనా..
ప్రస్తుత సామాజిక పరిస్థితులు, సాంకేతికత తెచ్చిన పెట్టిన అనర్థాలు తల్లిదండ్రులను కఠిన నిర్ణయాల వైపు నెడుతున్నాయి. బిడ్డలు కళ్లెదుటే ఉంటే ఎంతో సంతోషం...కానీ వారి భవిష్యత్ నాశనమైపోతుంటే చూస్తూ ఊరుకోలేం కదా అంటూ ప్రైవేట్, కార్పొరేట్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్చేస్తున్నారు.
మొబైల్ మాయ
ఈ పరిస్థితికి ప్రధాన కారణం స్మార్ట్‌ఫోన్ వ్యసనం. ప్రస్తుతం దాదాపు 70 శాతం మంది విద్యార్థులు మొబైల్ ఫోన్‌లకు బానిసలుగా మారుతున్నారు. స్కూల్ నుంచి ఇంటికి రాగానే పుస్తకాలు పక్కన పడేసి నిరంతరం ఫోన్‌లతోనే గడుపుతున్నారు. దీంతో చదువుపై ఏకాగ్రత తగ్గడమే కాకుండా, తల్లిదండ్రుల మాటలను సైతం ఖాతరు చేయని మొండితనం వస్తోంది. హాస్టళ్లల్లో ఉంచితే క్రమశిక్షణ అలవడుతుందని తల్లిదండ్రులు నమ్ముతున్నారు.
పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు తమ సర్వస్వం వెచ్చించేందుకు సైతం సిద్ధపడుతున్నారు. ప్రధానంగా రెసిడెన్షియల్ స్కూళ్లలో చేర్పించేందుకు మొగ్గుచూపుతున్నారు. అక్కడ ర్యాంకులు.. మార్కులు వస్తున్నప్పటికీ అనుబంధం..ఆప్యాయతకు దూరమవుతున్నారు. అయినప్పటికీ మొబైల్ వ్యసనం నుంచి బిడ్డలను రక్షించుకునేందుకు హాస్టళ్లే శరణ్యమని మధ్యతరగతివారు భావిస్తున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాహకులు ఫీజుల పేరుతో నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. అయితే పేరెంట్స్ సైతం అప్పులకు వెరవకుండా పిల్లల భవిత కోసం ఆర్థిక భారం మోస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా..
పిల్లల చదువుల కోసం మధ్యతరగతి కుటుంబాలు ఎంత ఖర్చు పెట్టేందుకై నా ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం ఒక సాధారణ స్థాయి ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలలో సైతం 6 నుంచి 10 వ తరగతి విద్యార్థికి ఏడాదికి కనీసం రూ.80 వేల నుంచి రూ.1.20 లక్షల ఖర్చవుతోంది. డే స్కాల ర్ స్కూళ్లలోనే పుస్తకాలతో కలిపి రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు వసూలు చేస్తున్నారు. పేరున్న కార్పొరేట్ పాఠశాలలైతే ఇతర ప్రాంతాల్లో రూ.2.50 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. తమ ఆదాయానికి మించిన ఫీజులు ఉన్నప్పటికీ అప్పు చేసైనా పిల్లల బాగు కోసమే ఈ భారాన్ని తల్లిదండ్రులు మోస్తున్నారు.
స్మార్ట్‌ఫోన్ల నుంచి కాపాడుకునేందుకే..
స్మార్ట్‌ఫోన్ల వాడకం ముదిరిపోయి, పిల్లలు తల్లిదండ్రుల మాట కూడా వినని పరిస్థితి రావడం నిజంగా ఆందోళనకరం. ఈ మొబైల్ వ్యసనం నుంచి తమ పిల్లలను రక్షించుకోవడానికే తల్లిదండ్రులు ఎంతటి ఆర్థిక భారమైనా భరించడానికి సిద్ధపడుతున్నారు. అప్పు చేసైనా ప్రైవేట్ స్కూళ్లు, వసతి గృహాలకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ప్రైవేట్ హాస్టళ్ల దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ప్రధానంవగా గురుకులాలు, హాస్టళ్లలో కార్పొరేట్ స్థాయి వసతులు తీసుకురావాలి.పిల్లలు కూడా మొబైల్స్‌పై కాకుండా చదువుపై దృష్టిపెట్టాలి. – శివారెడ్డి, ఏఐఎస్‌ఎఫ్ జాతీయ కార్యదర్శి.


