హత్యా.. ప్రమాదమా..? | - | Sakshi
Sakshi News home page

హత్యా.. ప్రమాదమా..?

Jun 14 2026 7:22 AM | Updated on Jun 14 2026 7:22 AM

● అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి ● ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన

గంగవరం : బంగారుపాళెం మండలం జి.కురప్పల్లెకు చెందిన ఓ యువకుడు తీవ్రగాయాలతో శుక్రవారం మృతి చెందాడు. అయితే యువకుడి మరణంపై కుటుంబీకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. జి.కురప్పల్లెలో నివసించే దేవేంద్ర, హేమలత దంపతుల కుమారుడు జయదీప్‌(25) ఎంబీఏ పూర్తి చేసి బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ బాలిక(16)తో రెండేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం ఆ బాలిక గంగవరం మండలం దండపల్లె కురప్పల్లెలోని తన అమ్మమ్మ ఇంట్లో ఉంటూ పలమనేరులోని ఓ కాలేజీలో ఇంటర్‌ చదువుతోంది. ఈ క్రమంలోనే జయదీప్‌ దండపల్లె కురప్పల్లెకు చెందిన తన స్నేహితులు వినూత్‌, కల్యాణ్‌తో కలిసి బైక్‌పై బాలిక ఇంటి వద్దకు ఈ నెల 3వ తేదీ రాత్రి వెళ్లాడు. ఇద్దరూ కలిసి వారింటి మిద్దైపెన మాట్లాడుకుంటూ ఉండగా బాలిక తాత నిద్ర లేచి వచ్చేశాడు. దీంతో జయదీప్‌ అక్కడి నుంచి పారిపోయే యత్నంతో మిద్దైపె నుంచి పడిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. తల, కాలికి బలమైన గాయాలు కావడంతో వెంటనే అంబులెన్స్‌లో పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై జయదీప్‌ కుటుంబీకులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన అక్కడకు చేరుకుని మెరుగైన చికిత్స నిమిత్తం రాణిపేట సీఎంసీకి తీసుకెళ్లి.. అనంతరం తిరుపతికి తరలించారు. శుక్రవారం మళ్లీ చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళుతుండగా మార్గం మధ్యలో మరణించాడు. అయితే బాలిక బంధువులే తమ బిడ్డను కొట్టి చంపేశారని జయదీప్‌ కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శనివారం దండపల్లె కురప్పల్లెలో జయదీప్‌ గాయపడిన ప్రాంతాన్ని పలమనేరు డీఎస్పీ ప్రభాకర్‌, సీఐ రాంభూపాల్‌ పరిశీలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement