పలమనేరు/ బైరెడ్డిపల్లె : ఆర్‌టీసీ నాన్ ఏసీ స్లీపర్ కోచ్ బస్సులకు పేరు ఎంపికపై పోటీ చేపట్టింది. ఇందులో బైరెడ్డిపల్లె మండలం బేలుపల్లె పంచాయతీ చిక్కనపల్లెకు చెందిన బండి రెడ్డెప్ప స్టార్ లైనర్ అనే పేరును సూచించి రూ.10వేల బహుమతితోపాటు ఆర్టీసీ అధికారుల సత్కా రం అందుకున్నారు. వివరాలు.. 2022లో నాన్‌ఏసీ స్లీపర్ కోచ్ బస్సులకు ఏదైనా కొత్త పేరు పెట్టాలని ఇందులో ఎంపికై న వారికి బహుమతి ఉంటుందని ఆర్‌టీసీ ప్రకటన జారీ చేసింది. దీంతో బండి రెడ్డెప్ప ఇరవై పేర్లను సూచిస్తూ ఆర్టీసీ వారికి పంపారు. రాష్ట్రవ్యాప్తంగా 3,585మంది రకరకాల పేర్లను సూచించారు. ఎట్టకేలకు రెడ్డెప్ప సూచించిన స్టార్ లైనర్ పేరుకే బహుమానం దక్కింది. ఈ మేరకు రెండు రోజుల క్రితం హైదరాబాదులోని బస్సు భవన్‌లో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఘనంగా సన్మానించి రూ.10వేల బహుమతిని అందజేశారు.


