తొలి రోజు మొక్కుబడిగా తరగతులు
మధ్యాహ్న భోజనం అస్తవ్యస్తం
పూర్తి స్థాయిలో అందని
విద్యార్థి మిత్ర కిట్లు
విద్యాసంవత్సర ప్రారంభం రోజున సర్కారు బడుల్లో ఇదీ తీరు
జిల్లా వ్యాప్తంగా శుక్రవారం బడిగంట మోగింది. పాఠశాలలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు సమస్యలతోనే ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. మధ్యాహ్న భోజనం అస్తవ్యస్తంగా మారింది. పిల్లలకు పూర్తిస్థాయిలో విద్యార్థి మిత్ర కిట్ల అందలేదు. టీచర్లు పూర్థి స్థాయిలో కనిపించలేదు. అసంపూర్తిగా ఉన్న తరగతి గదుల్లోనే పిల్లలు కూర్చోవాల్సి వచ్చింది. మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నా పట్టించుకోలేదు. పిల్లలు తాగునీటి కోసం మొదటి రోజే తిప్పలు పడాల్సి వచ్చింది. జిల్లాలో తరగతులు ప్రారంభమైన మొదటి రోజు పాఠశాలల నిర్వహణ దుస్థితిపై సాక్షి కథనం.
చిత్తూరు కలెక్టరేట్ : వేసవి సెలవులు పూర్తి కావడంతో శుక్రవారం నుంచి పాఠశాలలు పున:ప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వం పెద్దగా దృష్టి సారించకపోవడంతో పాఠశాలల్లో విద్యార్థులకు అసౌకర్యాలు స్వాగతం పలికాయి. పాఠశాలలను పునః ప్రారంభం రోజుకు ముందే శుభ్రం చేయాల్సి ఉండగా, జిల్లాలోని అత్యధిక శాతం పాఠశాలలను హడావుడిగా తెరిచారు. మొదటి రోజునే పిల్లల చేతిలో పాఠ్యపుస్తకాలు పెడతామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు సైతం పూర్తి స్థాయిలో అందించలేని దుస్థితి ఏర్పడింది.
మరుగుదొడ్ల నిర్వహణ గాలికి
జిల్లాలోని 2,067 పాఠశాలల్లో విద్యార్థుల నిష్పత్తి ప్రకారం 11,435 మరుగుదొడ్లు అవసరం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం బాల, బాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు నిర్మించింది. వాటి శుభ్రతకు 2,458 మంది ఆయాలను నియమించింది. స్కూల్ పునఃప్రారంభానికి ముందు రోజే మరుగుదొడ్లను శుభ్రం చేయాల్సి ఉండగా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు.
పనిచేయని ఆర్‌వో ప్లాంట్లు
విద్యార్థులకు రక్షిత మంచినీటిని అందించేందుకు గత సర్కారు రూ.లక్షలతో ఆర్‌వో ప్లాంట్లను ఏర్పా టు చేసింది. వాటిని ప్రస్తుత చంద్రబాబు సర్కారు పట్టించుకోకపోవడంతో మూలనపడ్డాయి. అనేక పాఠశాలల్లో విద్యార్థులు మొదటి రోజే తాగునీటికి అవస్థలు పడ్డారు. ఇళ్ల నుంచి బాటిళ్లల్లో నీళ్లు తెచ్చుకున్నారు.
కనిపించని మెనూ
జిల్లా వ్యాప్తంగా 2,067 పాఠశాలల్లో 1,10,547 మంది విద్యార్థులు ఉన్నారు. తొలిరోజు 54,490 మంది హాజరయ్యారు. వారిలో 54,256 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టారు. అనేక పాఠశాలల్లో మెనూ కనిపించలేదు. పాఠశాలల్లో పాతబడిన బియ్యంతోనే అన్నం చేసి పెట్టారు. నీళ్ల సాంబారు వడ్డించారు. కోడిగుడ్లు సరఫరా చేయక పోవడంతో వడ్డించలేని దుస్థితి.
అరకొరగా విద్యార్థి మిత్త కిట్ల పంపిణీ
జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతు న్న విద్యార్థుల్లో 1,10 లక్షల మందికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేయా ల్సి ఉంది. విద్యాశాఖ గణాంకాల ప్రకారం పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ మాత్రమే అందజేశారు. అవి కూడా అరకొరగానే ఇచ్చారు. జిల్లాలో ఒక్క మండలానికి కూడా బ్యాగులు, షూలు, సాక్స్‌లు రాలేదు.
బూట్లు ఇవ్వకపోవడంతో పాదరక్షలతో పాఠశాలకు వచ్చిన పీసీఆర్ పాఠశాల విద్యార్థులు, పీసీఆర్ పాఠశాలలో పనిచేయని ఆర్‌వో ప్లాంట్
మోగిన బడిగంట
కొత్త బ్యాగుల జాడేలేదు
జిల్లా వ్యాప్తంగా 2,067 ప్రభుత్వ పాఠశాలలున్నా యి. వీటిలో 1,10,547 మంది పిల్లలు చదువుతుండగా మొదటి రోజు 54,490 మంది హాజరయ్యా రు. విద్యార్థి మిత్ర కిట్లు ఇవ్వలేదు. కొత్త బ్యాగులు ఇవ్వకపోవడంతో పాతవి, చినిగిన బ్యాగులతోనే పిల్లలు హాజరయ్యారు. చాలా పాఠశాలల్లో టీచర్లు పూర్తి స్థాయిలో కనిపించలేదు. ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాల కోసం చేపట్టిన పనులు పూర్తి కాకపోవడంతో అసంపూర్తి గదుల్లోనే పిల్లలు అవస్థలు పడ్డారు.


