ప్రసవమా.. ఆపరేషనా..? | - | Sakshi
Sakshi News home page

ప్రసవమా.. ఆపరేషనా..?

Jun 13 2026 7:20 AM | Updated on Jun 13 2026 7:20 AM

● సిజేరియన్లతో తల్లుల ఆరోగ్యంపై ముప్పు ● ప్రైవేటు ఆస్పత్రుల్లో విచ్చలవిడిగా కడుపు కోతలు ● ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ పెరుగుతున్న ఆపరేషన్లు ● నాలుగు నెలల్లో 4,754 సిజేరియన్లు.. కేవలం 2,380 సాధారణ ప్రసవాలు

మహిళ జీవితంలో అమ్మగా మార డం అత్యంత ఆనందకరమైన ఘట్టం. ప్రస్తుతం ఆ ఆనందం కంటే భయం ఎక్కువగా వెంటాడుతోంది. ఒకప్పుడు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే చేసే సిజేరియన్లు ఇప్పుడు సాధారణ ప్రక్రియగా మారిపోయాయి. గర్భిణి ఆస్పత్రి గడప తొక్కితే చాలు కోతలకు సిద్ధం చేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చేయడం పరిపాటిగా మారినా, ప్రభుత్వ వైద్యశాలల్లోనూ సిజేరియన్ల సంఖ్య పెరగడం ప్రజారోగ్య నిపుణులను కలవరపెడుతోంది.

కాణిపాకం : చిత్తూరు జిల్లాలో నాలుగు నెలల కాలంలో నమోదైన ప్రసవాల గణాంకాలను పరిశీలిస్తే సిజేరియన్ల పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో స్పష్టమవుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు 1,626, సిజేరియన్లు 2,572 వరకు నమోదయ్యాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు 754, సిజేరియన్లు 2,182 వరకు జరిగాయి. మొత్తం సాధారణ ప్రసవాలు 2,380, సిజేరియన్లు 4,754 వరకు తేలాయి. అంటే జిల్లాలో నమోదైన మొత్తం ప్రసవాల్లో దాదాపు రెండింట మూడొంతులకు పైగా సిజేరియన్లు కావడం గమనార్హం. ప్రతి సహజ ప్రసవానికి దాదాపు రెండు సిజేరియన్లు జరుగుతున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్ల మోత

ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవాలంటే చాలా కుటుంబాలు భయపడుతున్నాయి. ఇందుకు అక్కడికి వెళితే సిజేరియన్‌ తప్పదనే భావన సర్వత్రా నెలకొనడమే. ప్రసవానికి వచ్చిన గర్భిణులకు ‘‘బిడ్డ మెడకు తాడు చుట్టుకుంది. బిడ్డ కదలికలు తగ్గాయి. ఉమ్ము నీరు తగ్గిపోయింది. బిడ్డ ఉమ్మునీరు తాగింది. ఆలస్యం చేస్తే ప్రమాదం’’ వంటి కారణాలు చెబుతూ ఆపరేషన్లకు ఒప్పిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సహజ ప్రసవం జరిగితే కొన్ని గంటల్లోనే ఇంటికి వెళ్లే అవకాశం ఉంటుంది. సిజేరియన్‌ అయితే మందులు, గది ఛార్జీలు, పరీక్షలు, వైద్యుల ఫీజులు అంటూ బిల్లులు భారీగా పెరుగుతాయి. దీంతో కొన్ని ఆస్పత్రుల నిర్వాహకులు సిజేరియన్లు చేయడానికే మొగ్గు చూపుతున్నారనే విమర్శలు ఉన్నాయి.

ముహూర్తాల మోజు

జిల్లాలో ముహూర్తాల పేరుతో సిజేరియన్లు, శుభ సమయాల్లో పిల్లలు పుట్టాలని కోరుకునే కుటుంబాలు పెరుగుతున్నాయి. ముందుగానే తేదీలు, గంటలు నిర్ణయించి ప్రసవాలు చేస్తున్నారు. ప్రకృతి నిర్ణయించే ప్రసవ సమయాన్ని పక్కనబెట్టి మనుషులు నిర్ణయించిన సమయాల్లో పిల్లలను బయటకు తీసుకురావడం వైద్యపరంగా సరైన పద్ధతి కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు నేటి తరంలో చాలా మంది మహిళల్లో సహజ ప్రసవంపై భయం పెరిగింది. పురిటి నొప్పులు తట్టుకోలేమనే భావనతో ముందుగానే సిజేరియన్‌కు అంగీకరిస్తున్నారు.

ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవ వివరాలు...

ప్రభుత్వ వైద్యశాలలో ప్రసవ వివరాలు

నెల సిజేరియన్లు సాధారణ

ప్రసవాలు

జనవరి 489 154

ఫిబ్రవరి 596 185

మార్చి 590 210

ఏరిపిల్‌ 507 205

మొత్తం 2182 754

నెల సిజేరియన్లు సాధారణ

ప్రసవాలు

జనవరి 627 329

ఫిబ్రవరి 599 402

మార్చి 760 495

ఏరిపిల్‌ 586 400

మొత్తం 2572 1626

ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి

జిల్లాలో ఒక జిల్లా ఆస్పత్రి, నాలుగు ఏరియా ఆస్పత్రులు, ఏడు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, 50 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 14 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు ఉన్నాయి. ప్రైవేటు ఆస్పత్రులు 1000 వరకు ఉన్నాయి. ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వ వైద్యశాలల్లోనూ సిజేరియన్ల సంఖ్య అధికంగా ఉండడం ప్రశ్నలు రేకెత్తిస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తూ పీహెచ్‌సీల్లోనే ఎక్కువ ప్రసవాలు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యంగా సిజేరియన్లను తగ్గించాలని పీహెచ్‌సీలు 24 గంటలు పనిచేసేలా చేశారు. దీనిపై గర్భిణులకు ముందస్తు అవగాహన కల్పించి సహజ ప్రసవాల వైపు మళ్లించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ దిశగా పర్యవేక్షణ తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సిజేరియన్లను తగ్గించే దిశగా ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement