గాడితప్పిన ముందస్తు చికిత్సలు | - | Sakshi
Sakshi News home page

గాడితప్పిన ముందస్తు చికిత్సలు

Jun 13 2026 7:20 AM | Updated on Jun 13 2026 7:20 AM

విభాగాలకు తాళాలు విధులకు ఉద్యోగుల డుమ్మా కొరవడిన పర్యవేక్షణ

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): చిన్నారులకు ముందస్తు వైద్య పరీక్షలు, చికిత్సలు అందించాల్సిన జిల్లా బాలల ముందస్తు చికిత్సా కేంద్రం (డీఈఐసీ)లో పరిస్థితులు గాడితప్పాయి. చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఉన్న ఈ కేంద్రంలో కొందరు ఉద్యోగులు, సిబ్బంది టీ, కాఫీల పేరుతో కాలక్షేపం చేస్తుండగా, మరికొందరు విధులకు డుమ్మా కొడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రానికి వచ్చే చిన్నారులకు అవసరమైన పరీక్షలు, వైద్య సేవలు అందడం లేదు. కొన్ని విభాగాలకు పనివేళల్లోనే తాళాలు వేసి ఉండడం, సంబంధిత ఉద్యోగులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా కొందరు ఉద్యోగులు, సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, బాధ్యతాయుతంగా సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పర్యవేక్షణ లోపమే కారణమా?

అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే సిబ్బంది ఇష్టానుసారంగా వ్యహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు తనిఖీలు చేసి హాజరు, సేవల తీరును పరిశీలిస్తే తప్ప పరిస్థితి మెరుగుపడదని స్థానికులు చెబుతున్నారు. దీనిపై డీఎంహెచ్‌ఓ నాగశశిభూషణ్‌రెడ్డిని వివరణ కోరగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సిబ్బందిని పిలిచి మెరుగైన వైద్య సేవలు అందించేలా చూస్తానని పేర్కొన్నారు.

బాలల ముందస్తు చికిత్సా కేంద్రం, పలు విభాగాలు తలుపులు వేసి ఉన్న దృశ్యం

సక్రమంగా పనిచేయని ముందస్తు చికిత్సా కేంద్రం

గంటల తరబడి నిరీక్షణ

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతి రోజూ అనేక మంది చిన్నారులు ముంద స్తు చికిత్సల కోసం ఈ కేంద్రానికి వస్తుంటారు. పలువురు ఉద్యోగులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడం, కొన్ని విభాగాలు మూసివేయడంతో తల్లిదండ్రులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. సిబ్బంది ఎంతసేపటికీ రాకపోవడంతో నిరాశతో వెనుదిరగాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే పిల్లలకు సరైన వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement