చిత్తూరు అర్బన్: వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన ఇద్దరు నాయకులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీల్లో స్థానం కల్పించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. చిత్తూరుకు చెందిన వి.రెడ్డిశేఖర్ రెడ్డిను వైఎస్సార్‌టీఎఫ్ జోన్–4 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, పలమనేరుకు చెందిన ఎం.నాగేంద్రరెడ్డిను రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
నేడు ఉపకరణాల పంపిణీ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా విద్యాశాఖ, సమగ్రశిక్ష శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం విభిన్నప్రతిభావంతులకు ఉపకరణాలు పీవీకేఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఉన్న మహా త్మా జ్యోతిరావుపూలే భవనంలో ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ తెలిపారు. 463 మంది విభిన్నప్రతిభావంతులకు ఉపకరణాలు అందజేయనున్నట్లు ఏపీసీ వెల్లడించారు.
లింగ నిర్ధారణపై
సమాచారం ఇవ్వండి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ, లింగ ఎంపిక వంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 1800 233 2447 టోల్‌ఫ్రీ హెల్ప్‌లైను అందుబాటులో ఉంచిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నాగ శశిభూషణ్ రెడ్డి తెలిపారు. గర్భంలోని శిశువు లింగ నిర్ధారణ, లింగ నిర్ధారణ సేవల ప్రకటనలు, అనుమతి లేని స్కానింగ్ కేంద్రాల నిర్వహణ వంటి చర్యలు చట్టవిరుద్ధమని హెచ్చరించారు.
సర్‌ను పకడ్బందీగా చేపట్టాలి
గంగవరం: ఓటరు జాబి తా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) కార్యక్రమాన్ని ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా నిర్వహించాలని కలె క్టర్ సుమిత్‌కుమార్ ఆదే శించారు. ఈ సందర్భంగా గురువారం మండలంలోని ఎస్‌వీఎస్ ఫంక్షన్ హాల్లో పలమనేరు నియోజకవర్గంలోని బూత్ లెవల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే జూలై నెల 15వ తేదీ వరకు జరిగే డోర్ టు డోర్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఇందులో ముఖ్యంగా ఓటర్ల వివరాలను ధ్రువీకరించి సంతకాలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో డీఆర్ ఓ మోహన్‌కుమార్, ఆర్డీవో భవాని, అన్ని మండలాల అధికారులు, పాల్గొన్నారు.
ప్రవేశాలు పెరగాల్సిందే
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలల్లో ప్రస్తుత విద్యాసంవత్సరంలో గతం కంటే 10 శాతం ప్రవేశాలు పెరగాల్సిందేనని డీఐఈవో రఘుపతి వెల్లడించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు పెంచేలా ప్రిన్సిపల్స్ పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు.ఈనెల 12వ తేదీ నుంచి జూనియర్ కళాశాలలు పూర్తి రోజు పనిచేస్తాయన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1826 మొదటి సంవత్సరం అడ్మిషన్లు అయినట్లు తెలిపారు. జూలై 31వ తేదీ వరకు ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు.
అయిదు సర్కిళ్లకు ఒక్కరే సీఐ
చిత్తూరు అర్బన్: పోలీసు ఉద్యోగం నిత్యం పని ఒత్తిళ్ల మధ్య ఉంటుందని చెబుతూనే ఉంటారు. ఆ ఒత్తిడి ఎలా ఉంటుందో చూడాలంటే మాత్రం చిత్తూరులోని తూర్పు (తాలూక) సీఐ రామచంద్ర పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం ఆయన చిత్తూరు పోలీసు సబ్–డివిజన్‌లోని అయిదు సర్కిళ్లకు ఇన్‌చార్జిగా ఉన్నారు. చిత్తూరు వన్‌టౌన్ స్టేషన్, చిత్తూరు టూటౌన్ స్టేషన్ సీఐగా ఉన్న నెట్టికంటయ్య సెలవుపై ఉండటంతో ఈ రెండు సర్కిళ్లు, ట్రాఫిక్ సీఐ నిత్యబాబు, పశ్చిమ (వెస్ట్) సీఐ శ్రీధర్ నాయుడు సీఎం బందోబస్తు వెళ్లడంతో ఈ రెండు స్టేషన్లు, పూతలపట్టు సర్కిల్‌లో పనిచేసిన గోపి సస్పెన్షన్‌లో ఉండటంతో ఈ స్టేషన్‌కు కలిపి.. మొత్తంగా అయిదు సర్కిళ్లకు రామచంద్ర ఇన్‌చార్జ్‌గా ఉన్నారు.
తహసీల్దార్ సంతకం ఫోర్జరీ
శ్రీరంగరాజపురం : తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి ఒక వ్యక్తికి చెందిన ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసిన సంఘటన మండలంలో శ్రీరంగరాజపురంలో చోటుచేసుకుంది. బాధితుడు మహేష్ కథనం మేరకు శ్రీరంగరాజపురం గ్రామం కంఠంలో సర్వే నంబర్ 102లో 2 సెంట్ల స్థలంలో రేకుల ఇల్లుంది. దానిని తమిళనాడు రాష్ట్రం పల్లిపట్టు కు చెందిన త్యాగరాజ్, తులసిరామ్, మునిరత్నం, రాజమ్మ కలిసి శ్రీరంగరాజపురం తహసీల్దార్ సంతకం, కార్యాలయం రాజముద్రను ఫోర్జరీ చేసి కార్వేటినగరం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 2 సెంట్ల స్థలాన్ని పి.త్యాగరాజు పేరుపై రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది.ఈ విషయంపై బాధితుడు మహేష్ తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశాడు. స్పందించిన తహసీల్దార్ లోకనాథపిళ్‌లై ఫోర్జరీ చేసినట్లు గుర్తించి, పోలీసు స్టేషన్‌లో పిర్యాదు చేశారు.


