తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో
మామిడి రైతుల ఆక్రందన
సక్రమంగా కొనుగోలు చేయని ఫ్యాక్టరీలు
చెట్లల్లోనే కుళ్లిపోతున్న కాయలు
సీఎం సారూ..పట్టించుకోరూ!
కాణిపాకం: తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మామిడి అల్లకల్లోలమవుతోంది. పంట చేతికొచ్చిన వేళ గిట్టుబాటు ధర లేకుండాపోతోంది. శుక్రవారం తిరుపతి జిల్లాకు వస్తున్న సీఎం చంద్రబాబునాయుడు మామిడిగోడును పట్టించుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 90వేల హెక్టార్లలో మామిడి సాగులో ఉంది. టేబుల్ రకాలు 20వేల హెక్టార్లల్లో ఉండగా.. వీటిలోని పలు రకాలను కొనుగోలు చేసేవారు లేరని పాకాల, బంగారుపాళ్యం, చిత్తూరు మార్కెట్ లో తిరస్కరిస్తున్నారు. ఇక తోతాపురి రకం 70 వేల హెక్టార్లల్లో వ్యాపించి ఉంది. తద్వారా సు మారు 8 లక్షల నుంచి 10 లక్షల టన్నుల కా యల దిగుబడి రానున్నట్టు అధికారుల అంచనా. వీటిని గుజ్జు చేసే ఫ్యాక్టరీలు 44 వరకు ఉన్నాయి. సీజన్ సమయానికి 10 ఫ్యాక్టరీల వరకు గుజ్జు తయారీని ప్రారంభించాయి. మిగిలిన ఫ్యాక్టరీలు పేరుకు తెరుచుకున్నాయి. దీని కారణంగా తోతాపురి కోతలు మందగించాయి.
టోకన్ ఆపేశారు
కొన్ని ఫ్యాక్టరీలు గత వారం రోజులకుపైగా తోతాపురిని కొనుగోలు చేసి ప్రస్తుతానికి చెక్ పెట్టాయి. టోకన్లు ఇవ్వడం పూర్తిగా నిలుపుదల చేశాయి. తాజాగా వచ్చే వారం నుంచే కాయలు కొనుగోలు అంటూ ఫ్యాక్టరీలు గేట్లు వేసేశాయి. ఈ దెబ్బతో రైతులు షాక్‌లో పడ్డా రు.చెట్లల్లోనే కాయలు కుళ్లి..రాలిపోతున్నాయి.
ఫ్యాక్టరీలు సిండికేట్‌తోనే
ఫ్యాక్టరీల్లో గతేడాది గుజ్జు నిల్వలు 90శాతం వరకు ఖాళీ అయ్యాయి. కొన్ని ఫ్యాక్టరీలు దీన్ని సాకుగా చూపించి.. ఈ ఏడాది ఫ్యాక్టరులు తెరవడానికి కష్టపడ్డాయి. ఆ తర్వాత తోతా పురి కేజీ రూ.6 అని బోర్డు పెట్టాయి. కొన్ని ఫ్యాక్టరీలు మాత్రం కేజీ రూ.5 ప్రచారం చేస్తున్నాయి. ఫ్యాక్టరీలన్నీ సిండికేట్ అయ్యి తోతా పురి ధరను దెబ్బతీసేందుకు పావులు కదుపుతున్నాయి. ర్యాంపుల్లో తోతాపురి ధర కేజీ రూ.4కే కొంటున్నారు.
వారి గేట్లు తెరుస్తున్నారు
మామిడి విషయంలో కూడా కూటమి నేత లు అధికారాన్ని అడ్డుపెడుతున్నారు. తమ కాయలనే కొనాలని ఫ్యాక్టరీలను బెదిరిస్తున్నారు. టోకన్లు, క్యూ లేకుండా..కాయలు నేరుగా దింపుకోమని హుక్కుం జారీ చేస్తున్నారు. దీంతో సామాన్య రైతుల కాయలు ట్రాక్టర్లల్లోనే కుళ్లిపోతున్నాయి. అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
గుడిపాల: సిఫార్సు ట్రాక్టర్లు ఓ వైపు...మరోవైపు సామాన్యుల ట్రాక్టర్లు , క్యూకట్టిన ట్రాక్టర్లు
ఈ పర్యటన లోనైనా..!
గత నెల యాదమరి మండలం, కండిగ గ్రామానికి వచ్చిన సీఎం చంద్రబాబు మామిడి రైతులను కలిసేందుకు అవ కాశం ఇవ్వలేకపోయారు. అలాగే కుప్పంకు వచ్చిన సమయంలో కూడా కలిసేందుకు అనుమతి ఇవ్వలేదు. శుక్రవారం తిరుపతి సభకు వస్తున్న సీఎం..మామిడి గోడు పట్టించుకుని.. వారి సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని రైతు సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.


