వి.కోట: పారిశ్రామికవాడల్లో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలకు సహకరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ కోరారు. ఆయన బుధవారం ఆర్డీవో భవానితో కలిసి వి.కోట మండలం ముసరందొడ్డి పంచాయతీలో పరిశ్రమల కోసం గుర్తించిన భూములను పరిశీలించారు. అనంతరం స్థానిక నేతలు, పారిశ్రామికవేత్తలు, రైతులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ముసరందొడ్డి రెవెన్యూలో 29 ఎకరాల భూమి సేకరించి రైతులకు నష్టపరిహారం చెల్లించామన్నారు. ఇంకా 47 ఎకరాల భూమి అవసరమని తెలిపారు. ఆయా భూముల రైతులకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం పరిహారం అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశ్వరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ రామచంద్ర నాయుడు, ఆర్‌ఐ మోహన్ తదితరులు పాల్గొన్నారు.


