ఇక సమరమే! | - | Sakshi
Sakshi News home page

ఇక సమరమే!

Jun 11 2026 8:11 AM | Updated on Jun 11 2026 8:11 AM

● హామీలు అమలు చేయకపోతే ఉద్యమాలు ● కూటమి ప్రభుత్వానికి ఉద్యోగుల హెచ్చరిక ● హామీలు ఏమయ్యాయి అంటూ నిలదీత

చిత్తూరు కలెక్టరేట్‌ : కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరిపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 12వ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని, తక్షణమే ఐఆర్‌ (మధ్యంతర భృతి) ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. హామీలను అమలుచేయకపోతే ఉద్యమాలు తప్పవని హెచ్చరికలు జారీ చేశాయి. భవిష్యత్‌ పోరాలకు సిద్ధమవుతామని నాయకులు తెలిపారు. పెరుగుతున్న ధరల వల్ల ఉద్యోగులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని, ప్రభుత్వం ప్రధాన ఆర్థిక అంశాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంపై దారుణమని పేర్కొన్నారు. నాయకులు బుధవారం చిత్తూరులోని రెవెన్యూ భవనంలో విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై నిరసన స్వరం వినిపించారు. ఉద్యోగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పట్టించుకోవడం లేదని నిలదీశారు. కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఊసే ఎత్తకపోవడంపై జేఏసీ నేతలు మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి తమ హామీలను నిలబెట్టుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తప్పవని ఏపీ జేఏసీ అమరావతి నేతలు సైతం హెచ్చరించారు.

ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసరాలు

ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 12వ పీఆర్సీ కమిషన్‌ వేయకపోవడం దారుణం. కనీసం ఐఆర్‌ కూడా ఇవ్వకపోవడం ఎంత వరకు న్యాయం? బకాయిల కోసం కూడా మీ చుట్టూ తిరగాలా? మా హక్కుల కోసం రోడ్లెక్కి పోరాటాలు చేస్తే తప్ప ప్రభుత్వం కదలదా?

– గోపి, ఏపీ జేఏసీ అమరావతి సంఘ సభ్యులు

రెండేళ్లు పూర్తయినా చలనం లేదు

ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్నా హామీల అమలుపై ఎలాంటి చలనం లేదు. ఇచ్చిన హామీలను మాత్రమే నెరవేర్చాలని అడుగుతున్నాం. అవి కూడా చేయకపోతే ఎలా? ఉద్యోగుల పట్ల అలసత్వం వహించడం బాధాకరం. పెండింగ్‌ బకాయిలను విడుదల చేయకపోతే రాష్ట్ర కమిటీ కార్యాచరణ మేరకు పోరాటాలు చేస్తాం.

– సుబ్రహ్మణ్యం, ఏపీ జేఏసీ అమరావతి సంఘం సభ్యులు

రెండేళ్ల చైల్డ్‌ కేర్‌ లీవులు ఇవ్వాలి

మహిళా ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణం గుర్తించాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్రంలోనూ మహిళా ఉద్యోగులకు రెండేళ్ల చైల్డ్‌ కేర్‌ సెలవులు ప్రకటించాలి. పెండింగ్‌ బకాయిల వివరాలను ప్రతినెలా వచ్చే పే–స్లిప్‌లో స్పష్టంగా చూపించాలి. ఐదు రోజుల పని విధానాన్ని తక్షణమే అమలు చేయాలి.

– జయంతి, చైర్‌పర్సన్‌, ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement