డబ్బులిస్తేనే బిల్లులు | - | Sakshi
Sakshi News home page

డబ్బులిస్తేనే బిల్లులు

Jun 11 2026 8:11 AM | Updated on Jun 11 2026 8:11 AM

ఫీల్డ్‌ అసిస్టెంట్‌ డబ్బు డిమాండ్‌ చేస్తున్నారు పట్టించుకోని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్న ఉపాధి కూలీలు

పాలసముద్రం : ఉపాధి పనులు చేసిన తర్వాత బిల్లులు పెట్టడానికి ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ డబ్బు డిమాండ్‌ చేస్తున్నాడని మండలంలోని క్రిష్ణజమ్మాపురం పంచాయతీ కొల్లిరెడ్డికండ్రిగ దళితవాడకు చెందిన కూలీలు ఆరోపించారు. వారు సోమవారం తమ గోడును వెల్లబోసుకున్నారు. మండుతున్న ఎండలో కష్టపడి పనులు చేసినా బిల్లులు సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. ఇప్పటి వరకు ఐదు వారాల బిల్లులు రాలేదని వాపోయారు. ఒక్కో కూలీ రూ.100 ఇస్తేనే బిల్లులు పెడతామని ఫీల్డ్‌ అసిస్టెంట్‌ డిమాండ్‌ చేస్తున్నట్టు ఆరోపించారు. అలా డబ్బులు ఇవ్వని కూలీలకు పనులు చూపడం లేదని తెలిపారు. కూలి పనులకు వెళ్లి కుటుంబాలను పోషించుకుందామనుని ఉపాధి పనులకు వస్తే బిల్లులు సక్రమంగా రాకపోతే ఎలా బతకాలని ప్రశ్నించారు. కృష్ణజమ్మాపురం పంచాయతీలో సుమారు 200 మందికి పైగా ఉపాధి కూలీలు పనులు చేస్తున్నట్టు తెలిపారు. ఉపాధిహామీ పథకంలో ఎన్నడూ లేని విధంగా అవకతవకలు, అక్రమాలు జరుగుతున్నాయని, ఈ విషయం తెలిసినా ఏపీడీ, ఏపీవో కన్నెత్తికూడా చూడడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మేమో ఉపాధిహామీ పథకంలో పని దినాలు, వేతనాలు పెంచామని చెబుతోందని, ఇక్కడ మాత్రం అలా జరగడం లేదని వాపోయారు. ఉపాధి సిబ్బందికి టీడీపీ నాయకులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఇలాగే చేశారని, అధికారులు విచారణకు వచ్చిన సమయంలో మీడియాపై నాయకులు దురుసుగా ప్రవర్తించారని చెబుతున్నారు. ఉపాధి ఫీల్డ్‌అసిస్టెంట్‌ అవినీతిపై ఏపీవోను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

అసలే ఎండలు ఎక్కువగా ఉన్నాయి. పనులు తక్కువగానే చూపిస్తున్నారు.

అరకొరగానే వేతనాలు వస్తున్నాయి.

దీనికితోడు మస్టర్‌ను అప్‌లోడ్‌ చేసి బిల్లులు పెట్టేందుకు ఫీల్డ్‌ అసిస్టెంట్‌

డబ్బు డిమాండ్‌ చేస్తున్నాడు.

అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదు. ఇలా అయితే ఎలా బతకాలి అని ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement