గంగవరం: మండలంలోని బాలేపల్లి గ్రామ సమీపంలోని ఉన్న కోళ్లఫారం షెడ్‌లో మంగళవారం ఛత్తీస్‌గడ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు.. ఛత్తీస్‌గడ్ రాష్ట్రం మహాసముంద్ జిల్లా బాస్నా గ్రామానికి చెందిన మన్‌బోధ్ బరిహా(32) మండలంలోని బాలేపల్లి గ్రామ సమీపంలోని ఆదినారాయణరెడ్డి కోళ్లఫారంలో కూలి పనులు చేసుకుంటున్నాడు. స్వగ్రామంలో అప్పులు ఉన్నట్టు అప్పుడప్పుడూ బంధువులతో చెప్పుకునేవాడు. ఈ క్రమంలో మనస్తాపం చెందిన అతను మంగళవారం రాత్రి కోళ్లఫారం షెడ్‌లో తాడుతో ఉరి వేసుకున్నాడు. గమనించిన బంధువు ఛబీలాల్ చౌహాన్ కోళ్లఫారం యజమానికి సమాచారం అందించాడు. వారు అక్కడికి వచ్చి పరిశీలించగా అతను మృతిచెంది ఉన్నాడు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పీఆర్‌లో పదోన్నతులు
చిత్తూరు కార్పొరేషన్: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పంచాయతీరాజ్ (పీఆర్) డీఈఈలుగా ఉన్న పలువురికి ఈఈలుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో చిత్తూరు పీఆర్‌ఐ ఇన్‌చార్జి ఈఈగా ఉన్న నవీన్ కుమార్‌ను పదోన్నతి కల్పించి అక్కడే కొనసాగించారు. అలాగే అనితను గుడూరుకు, భాస్కర్‌ను అనంతపురానికి, చైతన్యకుమార్‌ను వైఎస్సార్ కడపకు, రాజశేఖర్‌ను కావలికి పదోన్నతిపై బదిలీ చేశారు.
ట్రాక్టర్ బోల్తా..
తప్పిన పెను ప్రమాదం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని గంగసాగరం సమీపంలో బుధవారం మామిడి కాయలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. తుమ్మింద నుంచి చిత్తూరు మామిడి మార్కెట్‌కు కాయలను తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్ వెనుక భాగంలోని చక్రం విరిగిపోవడంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఆ సమయంలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి సురక్షితంగా బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది.
కారు బోల్తా
పూతలపట్టు(యాదమరి): మండలంలోని పి.కొత్తకోట సమీపంలో బుధవారం కారు బోల్తాపడి ఆరుగురు గాయపడ్డారు. స్థానికుల కథనం మేరకు.. కర్ణాటక రాష్ట్రం హొసూరుకు చెందిన ఒక కుటుంబానికి చెందిన ఆరుగురు మంగళవారం రాత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అనంతరం తిరుపతి జిల్లాలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకుని బుధవారం మధ్యాహ్నం కారులో తిరుగు ప్రయాణమయ్యారు. పి.కొత్తకోట సమీపంలో కారు డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. దీంతో నలుగురు మహిళలు సహా ఆరుగురు గాయపడ్డారు. వారిని స్థానికులు 108లో చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


