గంజాయి విక్రేతను పట్టించిన కిట్ జిల్లాలో తొలి కేస్ విజయవంతం ఒడిశా నుంచి గంజాయిని తీసుకువచ్చిన లారీ క్లీనర్ బైరెడ్డిపల్లి ప్రొహిబిషన్ ఎస్‌ఐ చందన ప్రియకు ప్రశంసలు
పలమనేరు: గంజాయి స్మగర్ల ఆటకట్టించడానికి జిల్లా ఎస్పీ తుషార్ దూడీ వారం క్రితం వినూత్న ప్రయోగం చేపట్టారు. అనుమానం ఉన్న వారిని కిట్ ద్వారా టెస్ట్ చేస్తే అతను మూడు రోజుల్లో గంజాయి పీల్చినా అది ఇట్టే పసిగట్టేస్తుంది. దీనిపై పలమనేరులో అవగాహన కార్యక్రమం నిర్వహించి డివిజన్‌లోని పోలీసులకు సమగ్రంగా వివరించారు. ఈ నేపథ్యంలో బైరెడ్డిపల్లి ప్రొహిబిషన్ ఎస్‌ఐ చందన ప్రియ ఈ కిట్స్‌తో అనుమానం ఉన్న వ్యక్తులను చెక్ చేశారు. రెండు రోజుల క్రితం ఒక వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. అతన్ని విచారించగా గంజాయి గట్టు రట్టు అయింది. బైరెడ్డిపల్లి మండలం దేవదొడ్డి పంచాయతీ, కూటాలవంక గ్రామానికి చెందిన నరేష్(39) కొన్నాళ్లుగా లారీ క్లీనర్‌గా ఇచ్చాపురం వైపు వెళుతున్నాడు. అక్కడ తక్కువ ధరకే గంజాయి దొరుకుతుండడంతో కొనుగోలు చేశాడు. తాను వాడుకుంటూనే స్థానికంగా కొందరికి విక్రయించేవాడు. ఇలా 2.6 కిలోలు తెచ్చుకున్నాడు. ఎట్టకేలకు కిట్ ద్వారా అతని విషయం బయటకు రావడంతో ఎస్‌ఐ చందనప్రియ కూపిలాగారు. కిట్ ద్వారా జిల్లాలోనే తొలి కేసు నమోదు చేశారు. పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ బుధవారం స్థానిక సీఐ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఎస్‌ఐని అభినందించారు. జిల్లా ఎస్పీ లక్ష్యం ముందుగా ఇక్కడే సత్పలితాన్నిచ్చిందన్నారు. నిందితుడు నరేష్‌పై కేసు నమోదు చేసి రూ.50 వేల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఇకపై పలమనేరు పోలీస్ సబ్ డివిజన్‌లో గంజాయి సేవించేవారు, విక్రయించేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.


