● సభాస్థలి కోసం రోజుకి రూ.1.2 కోట్లు ఖర్చు ● సభ 12కి వాయిదా వేయడంతో మరింత భారం ● మూడు రోజుల అద్దె కోసం మరో రూ.1.80 కోట్లు ● సభ కోసం జనం తరలింపునకు వాహనాల ఖర్చు అదనం ● ప్రజాధనాన్ని ఇలా దుబారా చేయడంపై విమర్శలు
అలవికాని హామీలు.. అందలమెక్కిన తర్వాత వెన్నుపోటు రాజకీయం.. రెండేళ్లు పాలన పూర్తి.. వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి విజయోత్సవ సభ నిర్వహణకు రంగం సిద్ధం.. అందుకు రూ.కోట్ల ఖర్చు.. ఆ సభ వాయిదాతో మరింత పెరిగిన వ్యయం.. ఎవరిని మభ్యపెట్టాలన్న ఆలోచన.. ఎందుకీ ప్రజాధనం దుబారా? అని ఆర్థిక వేత్తలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలి.. రూ.వేల కోట్లు అప్పులు చేస్తూ ఆ నిధులను దుబారా చేయడం ఏమిటని తప్పుపడుతున్నారు.
సాక్షి టాస్క్‌ఫోర్స్: సీఎం చంద్రబాబు పాలన రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ సభ పేరుతో ప్రజాధనాన్ని కూటమి ప్రభుత్వం దుబారా చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతి సమీపంలోని దామినేడు వద్ద శుక్రవారం విజయోత్సవ సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదం కారణంగా ఈనెల 9న జరగాల్సిన విజయోత్సవ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌తోపాటు రాష్ట్రంలోని మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నాయకులు హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రెండేళ్ల పాలనలో హామీలు అమలు చేయలేకపోయినా.. అభివృద్ధి గురించి పట్టించుకోకపోయినా రూ.వేల కోట్లు అప్పులు చేస్తూ ఆ నిధులను దుబారా చేస్తుండడంపై ఆర్థిక నిపుణులు తప్పుబడుతున్నారు. అది చాలదన్నట్టు.. శుక్రవారం నిర్వహించనున్న విజయో త్సవ సభకు భారీ ఎత్తున ఖర్చు చేస్తుండడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మండలానికి 2 వేల మంది జనం
కూటమి విజయోత్సవ సభకు తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి నియోజక వర్గాల పరిధిలోని ప్రతి మండలం నుంచి 2 వేల మంది జనాన్ని తీసుకురావాలని నాయకులు హుకుం జారీ చేసినట్లు సమాచారం. ఆ 2 వేల మందిని తీసుకొచ్చి, తీసుకెళ్లడానికి అవసరమైన వాహనాలు, తాగునీరు, మజ్జిగ, భోజనం వంటి ఏర్పాట్ల బాధ్యత కూడా స్థానిక నాయకులకు అప్పగించినట్లు తెలిసింది. అలాగే డ్వాక్రా మహిళలను తీసుకొచ్చేందుకు ఏపీఓ, సంఘమిత్రలు, డ్వాక్రా లీటర్లకు బాధ్యతలు అప్పగించారు. సభకు రాకపోతే.. బ్యాంకు రుణాలు ఇచ్చేది లేదని అప్పుడే హెచ్చరికలు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విజయోత్సవ సభ ద్వారా రెండేళ్ల వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కూటమి నేతలు, ప్రభుత్వ యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది.
ఆర్భాటం కోసం రూ.కోట్లు ఖర్చా?
సీఎం చంద్రబాబు రెండేళ్ల పాలన సందర్భంగా విజయోత్సవ సభను దామినేడు వద్ద నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదట జూన్ 9వ తేదీన జరపాలని నిర్ణయించినా ఆ కార్యక్రమం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం కారణంగా శుక్రవారానికి వాయిదా వేశారు. చేసిన ఏర్పాట్లకు రోజుకు రూ.1.20 కోట్లు అద్దె చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. సభ శుక్రవారానికి వాయిదా పడడంతో చేసిన ఏర్పాట్లన్నీ అలానే కొనసాగించేందుకు మరో మూడు రోజులు అద్దె చెల్లించేలా మాట్లాడుకున్నారు. రోజుకు మరో రూ.60 లక్షల చొప్పున రూ.1.80 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదు ర్చుకున్నారు. దీనికి తోడు ప్రజలను తరలించేందుకు బస్సులు, ప్రైవేట్ వాహనాల అద్దె, కేటరింగ్, సెక్యూరిటీ, లైటింగ్ వంటి సేవలకు పెట్టాల్సిన అదనపు ఖర్చులు బడ్జెట్‌ను మరింత పెంచుతున్నాయి. విజయోత్స సభ కోసం మొత్తంగా సుమారు రూ.15 కోట్లు ఖర్చు చేస్తు న్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ దుబారా ఖర్చులపై ఆర్థిక నిపుణులు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒప్పందాలు, ఖర్చుల పారదర్శకతపై ప్రశ్నిస్తున్నారు. అప్పు లు చేస్తూ.. అవసరమైన అభివృద్ధి పనులను వాయిదా వేసి, భారీ రాజకీయ సమారోహాల కోసం ప్రజాధనం వినియోగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత అధికారులు కొన్ని అద్దెలను తగ్గించడంతోపాటు ఖర్చులను నియంత్రించామని చెబుతున్నారు.


