మామిడికి రెడ్‌ సిగ్నల్‌ | - | Sakshi
Sakshi News home page

మామిడికి రెడ్‌ సిగ్నల్‌

Jun 11 2026 8:05 AM | Updated on Jun 11 2026 8:05 AM

తమిళనాడు కాయల కొనుగోలుకు గ్రీన్‌ సిగ్నల్‌

ఫ్యాక్టరీల వద్ద బయటి రాష్ట్ర వాహనాల హవా

సిఫార్సులుంటే గంటల్లో అన్‌లోడింగ్‌

సామాన్య రైతులకు మూడు రోజుల నిరీక్షణ

తోటల్లో కాయలు.. రోడ్లపై ట్రాక్టర్లు.. గేట్ల వద్ద రైతుల పడిగాపులు

మామిడి రైతులకు ప్రతి ఏటా ఇబ్బందులు తప్పడం లేదు. సీజన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఫ్యాక్టరీల వద్ద కాయల కొనుగోలుకు, తర్వాత బిల్లుల కోసం పడిగాపులు తప్పడం లేదు. తాజాగా ఫ్యాక్టరీలు తమిళనాడు మామిడి కాయలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. స్థానిక రైతులకు నిబంధనల పేరుతో అడ్డంకులు సృష్టిస్తున్నాయి. దీనికితోడు కూటమి నేతల సిఫార్సులు ఉన్న వారి ట్రాక్టర్లు, లారీలు లోపలికి రయ్‌మని దూసుకెళుతుండడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు.

కాణిపాకం/గుడిపాల: గుడిపాల మండలంలోని పల్ప్‌ ఫ్యాక్టరీల వద్ద ప్రస్తుతం జిల్లాకు చెందిన ట్రాక్టర్ల కంటే తమిళనాడు నుంచి వచ్చిన లారీలు, ట్రాక్టర్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల నుంచి వ్యాపారులు కిలోకు రూ.3 చొప్పున కాయలను కొనుగోలు చేసి నేరుగా ఫ్యాక్టరీలకు తరలిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో స్థానికంగా పండిన కాయలకు కొనుగోలు అవకాశాలు తగ్గిపోతున్నాయని వాపోతున్నారు.

టోకెన్లపై రాజకీయ ముద్ర

కొనుగోలు కేంద్రాల వద్ద టోకెన్ల వ్యవహారం రాజకీయ రంగు పులుముకుందని రైతులు ఆరోపిస్తున్నారు. సాధారణ రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలో నిల్చున్నా టోకెన్లు దొరకడంలేదు. కొందరు రాజకీయ నాయకుల సిఫార్సులు ఉంటే టోకెన్లు సులభంగా లభిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కష్టపడి టోకెన్లు సంపాదించినా రైతులకు ఇబ్బందులు తీరడం లేదు. కాయలు అన్‌లోడింగ్‌ కావాలంటే రెండు నుంచి మూడు రోజుల వరకు సమయం పడుతోంది. దీంతో ఫ్యాక్టరీల వద్ద వందలాది ట్రాక్టర్లు క్యూల్లో నిలుస్తున్నాయి. సిఫార్సులతో వచ్చే వాహనాలకు గంటల వ్యవధిలోనే అన్‌లోడింగ్‌కు గేట్లు తెరుస్తున్నారు.

వాయిదా పడుతున్న టోకెన్ల పంపిణీ

ఇప్పటికే భారీగా కాయలు వస్తుండడంతో అనేక ఫ్యాక్టరీలు టోకెన్ల జారీని నిలిపేశాయి. ఈ నెల 16 తర్వాతే టోకెన్లు ఇస్తామని ఫ్యాక్టరీలు చేతులెత్తేశాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోసిన కాయలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే నాణ్యత తగ్గిపోతుందని, చివరకు నష్టాలు తప్పవని చెబుతున్నారు. జిల్లాలో మామిడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కూటమి ప్రభుత్వం స్పందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

జిల్లా రైతులకు సవాలక్ష నిబంధనలు

జిల్లాకు చెందిన రైతులు కాయలు విక్రయించాలంటే ముందుగా శ్యాంపిల్స్‌ తీసుకురావాలి. వాటిని పరిశీలించి ఆమోదిస్తేనే టోకెన్‌ ఇస్తారు. వెంటనే కొనుగోలు చేస్తారా అంటే అదీ లేదు. ఎప్పుడు పిలుస్తారో తెలియదు. కాయలు కోసి ట్రాక్టర్లలో ఉంచుకుని రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. బయటి రాష్ట్రాల నుంచి కాయలను తీసుకువస్తున్న రైతులకు ఎలాంటి నిబంధనలు లేకుండా నేరుగా కొనుగోలు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement