కిలో రూ.7లకే తోతాపురి కొనుగోలు ఐడీ కార్డు లేకపోతే ఎంట్రీ లేదు గేట్ పాస్ కోసం రెండు రోజుల నిరీక్షణ గిట్టుబాటు ధర లేక రైతుల గగ్గోలు కలెక్టర్ జోక్యం కోరుతున్న బాధితులు
కాణిపాకం/గంగాధర నెల్లూరు : చిత్తూరు జిల్లాలో వేలాది ఎకరాల్లో సాగు చేసిన తోతాపురి మామిడి పంట ప్రస్తుతం మార్కెట్‌కు వస్తోంది. ఫ్యాక్టరీ యాజమాన్యం కిలోకు రూ.7లు మాత్రమే చెల్లిస్తోందని రైతులు చెబుతున్నారు. ఎకరాకు రూ.లక్షల పెట్టుబడి పెట్టి పంట సాగు చేశామని, ఫ్యాక్టరీ ఇచ్చే ధర కాయలు కోసేందుకు అయ్యే ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఫ్యాక్టరీ వారు ఈ సారి కొత్తగా గేట్ పాస్, రైతు ఐడీ కార్డు తప్పనిసరి చేయడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గేట్ పాస్ కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోంది. ఈ క్రమంలో ప్రధాన ద్వారం వద్ద భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. ప్రస్తుతం దాదాపు 200 వరకు ట్రాక్టర్లు క్యూలో ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. కాయలను ఆలస్యంగా దించుతుండడంతో నాణ్యత దెబ్బతింటోందని, బరువు కూడా తగ్గుతోందని ఆరోపిస్తున్నారు.
యాజమాన్యం లేఖ..?
ఫ్యాక్టరీ వద్ద పెరుగుతున్న రద్దీ, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని రైతులను నియంత్రించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌కు జైన్ యాజమాన్యం లేఖ రాసినట్లు సమాచారం. తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, ఇందుకోసం ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని మామిడి రైతులు కోరుతున్నారు. గిట్టుబాటు ధర ప్రకటించడంతో పాటు కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఫ్యాక్టరీల వద్ద కొనుగోలు ప్రక్రియను సులభతరం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రాంపుల వద్ద మరింత దారుణం
ఫ్యాక్టరీ వద్ద గంటల తరబడి వేచి ఉండలేని రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. అక్కడ పరిస్థితి మరింత దారుణంగా ఉందని చెబుతున్నారు. రాంపుల వద్ద కొందరు వ్యాపారులు కిలో రూ.6లకే కొనుగోలు చేస్తున్నట్లు రైతులు పేర్కొంటున్నారు.
చిత్తూరు జిల్లా మామిడి రైతుల కష్టాలు మొదలయ్యాయి. మామిడి సీజన్ ప్రారంభం కావడంతో జీడీ నెల్లూరు మండలంలోని మామిడి గుజ్జు పరిశ్రమ వద్ద వందలాది ట్రాక్టర్లు బారులు తీరాయి. ఒకవైపు గిట్టుబాటు ధర లేకపోవడం, మరోవైపు ఫ్యాక్టరీలో కొత్తగా అమలు చేస్తున్న రైతు ఐడీ కార్డు, గేట్ పాస్ విధానాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా ఫ్యాక్టరీ గేటు వద్ద ట్రాక్టర్ల క్యూలు కనిపిస్తుండడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది.
జైన్ ఫ్యాక్టరీ గేటు వద్ద బారులు తీరిన ట్రాక్టర్లు


