ఆహారంపై బండ | - | Sakshi
Sakshi News home page

ఆహారంపై బండ

May 3 2026 7:35 AM | Updated on May 3 2026 7:35 AM

అమాంతం పెరిగిన భోజనం, టిఫిన్‌ ధరలు వాణిజ్య గ్యాస్‌ ధరలు పెరగడమే కారణం గ్యాస్‌ ధరలు పెంచక ముందు నుంచే ధరల మంట పది నుంచి 25 శాతానికి పెంపు తిరుపతిలో పలు హోటళ్లలో భోజనం కరువు

సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతిలోని ఓ ప్రధాన హోటల్‌లో మొన్నటి వరకు భోజనం రూ.120 ఉండేది. అదే హోటల్‌లో నేడు భోజనం రూ.160. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే అనేక మంది భక్తులు వెళ్లే మరో హోటల్‌లో నేడు భోజనం రూ.180కి పెంచారు. బస్టాండ్‌ సమీపంలోని ఓ హోటల్‌లో స్పెషల్‌ భోజనం రూ.180 నుంచి రూ.220 చేశారు. సంప్రదాయ భోజనం పేరుతో వెలసిన హోటల్‌లో భోజనం రూ.120 నుంచి రూ.180కి పెంచేశారు. అవే హోటళ్లలో ఇడ్లీ, దోశ, చపాతీ ధరలకు కూడా 20శాతం పెంచేశారు. తమిళనాడు వాసులు ఎక్కువశాతం వెళ్లే హోటల్‌లో భోజనం ధరలతో పాటు జ్యూస్‌ ధరలు కూడా అమాంతం పెంచేశారు. మొన్నటి వరకు ఒక జ్యూస్‌ ధర రూ.90 ఉంటే.. నేడు అదే జ్యూస్‌ ధర రూ.146కి పెంచేశారు. ఈ ధరలు మొన్నటి వరకు. నిన్నటి నుంచి వాణిజ్య గ్యాస్‌ ధరలు పెంచడంతో ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తప్పని జీఎస్టీ

చపాతి, పూరీకి జీఎస్టీ లేదని కేంద్రం ప్రకటించినా.. నగరంలోని పలు హోటళ్లలో జీఎస్టీతో కలిపి బిల్లు వేస్తున్నారు. తినుబండారాల ధరలు కూడా పెరిగాయి. వాణిజ్య గ్యాస్‌ ధరలు పెరగడంతో మరింత పెరిగే అవకాశం ఉందని హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లాలు పర్యాటక, ఆధ్యాతిక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. అలాగే తిరుపతి, తిరుమల, శ్రీకాళహస్తి, చంద్రగిరి, కాణిపాకం ప్రాంతాలకు భక్తులతో పాటు పర్యాటకులు కూడా అధికంగా వచ్చి వెళుతుంటారు. పర్యాటకులు, భక్తులను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతాల్లో పలు మెస్‌ల నుంచి స్టార్‌ హోటళ్ల వరకు నడుపుతున్నారు. ఇరాన్‌ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గ్యాస్‌ కొరత కారణంగా తిరుపతి, చిత్తూరులో పలు హోటళ్లలో భోజనం ఆపేశారు. మరి కొన్ని హోటళ్లను పూర్తిగా మూసివేశారు. ప్రధానంగా తిరుపతిలో రెండు మూడు హోటళ్లలో మాత్రమే భోజనం లభ్యమవుతోంది. గ్యాస్‌ కొరత, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆ హోటళ్ల నిర్వాకులు భోజనం, టిపిన్స్‌, చపాతీ, పరోటా ధరలను అమాంతం పెంచేశారు. తాజాగా వాణిజ్య సిలిండర్ల ధరలు పెరగడంతో నేటి నుంచి కొత్త ధరలు అమలు చేయనున్నట్లు హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు.

మెస్‌ల్లోనూ..

సామాన్యులు తినే మెస్‌ల్లో భోజనం రూ.80 నుంచి రూ.120 ఉండేది. పదిహేను రోజులుగా అవే హోటళ్లలో భోజనం రూ.160కి పెంచేశారు. ఇక టిఫిన్స్‌ విషయానికి వస్తే ప్లేట్‌ ఇడ్లీ మొన్నటి వరకు రూ.20 ఉండేది. ఇప్పుడు అదే ప్లేట్‌ ఇడ్లీ రూ.35 నుంచి రూ.40కి విక్రయిస్తున్నారు. దోశ, పూరి ప్లేటు రూ.10 నుంచి రూ.15కి పెంచేశారు. వెజ్‌ రైస్‌, గోబీ, దొండకాయ రైస్‌ వంటివి ప్రస్తుతం రూ.100 చొప్పున విక్రయిస్తున్నారు. ఇవే పదిహేను రోజుల క్రితం వరకు రూ.50 నుంచి రూ.80 మాత్రమే. ఇకపోతే మెస్‌ల్లో సంగటి, మటన్‌, చికెన్‌తో కలిపి భోజనం మొన్నటి వరకు రూ.120 విక్రయించేవారు. ప్రస్తుతం రూ.190 నుంచి రూ.240కి పెంచేశారు.

వామ్మో.. హోటల్‌ తిండా?

రెట్టింపు కానున్న ఆహార పదార్థాల ధరలు

తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో హోటళ్లతో పాటు కర్రీ పాయింట్లు కూడా అధికంగా ఉన్నాయి. ఉద్యోగులు, విద్యార్థులు తదితరులు అన్నం వండుకుని కూరల కోసం కర్రీ పాయింట్లను ఆశ్రయిస్తుంటారు. వారికి ధరల భారం తప్పదు. ఇరాన్‌ యుద్ధం కారణంగా గ్యాస్‌ కొరత ఏర్పడడంతో ఇప్పటికే అనేక కర్రీ పాయింట్లు మూతపడ్డాయి. ఉన్న కర్రీ పాయింట్లు ధరలు పెంచి విక్రయిస్తున్నారు. తాజాగా వాణిజ్య సిలిండర్ల ధరలు పెంచడంతో కర్రీ పాయింట్ల నిర్వాహకులు కూడా ఆహార పదార్థాల ధరలను పెంచే అవకాశం ఉంది. అలాగే స్వీట్లు, సేవరీస్‌ వంటి ధరలు కూడా పెరగనున్నాయి. ఇరాన్‌ యుద్ధం పుణ్యమా అని సామాన్యుడి పరిస్థితి దయనీయంగా మారింది. సంపాదన అంతంత మాత్రమే ఉన్నా.. ఖర్చులు అంతకంతకు పెరిగిపోతుండడంతో సామాన్యులు విలవిలలాడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement