కుప్పం పోలీస్‌ స్టేషన్‌ ఎదుట చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి నిరసన | - | Sakshi
Sakshi News home page

కుప్పం పోలీస్‌ స్టేషన్‌ ఎదుట చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి నిరసన

Apr 16 2026 10:30 AM | Updated on Apr 16 2026 10:30 AM

సీనియర్‌ జర్నలిస్టు పూడి శ్రీహరిని చూపించాలని డిమాండ్‌ కోర్టులో చూపిస్తామన్న డీఎస్పీ పార్థసారథిపై ఒకింత ఆగ్రహం పోలీసులపై తిరుపతి కోర్టు చేసిన వ్యాఖ్యలు గుర్తు చేసిన మోహిత్‌రెడ్డి

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: సీనియర్‌ జర్నలిస్టు పూడి శ్రీహరిని కుప్పం పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని తెలుసుకున్న చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి బుధవారం రాత్రి అక్కడకు వెళ్లి శ్రీహరిని చూపించాలని పోలీసులను అడిగారు. వారు వీలు లేదని, కోర్టులో చూపిస్తామని చెప్పడంతో ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు చూపించరని డీఎస్పీ పార్థసారథిని నిలదీశారు. ఇలాగే పోలీసులు అక్రమ కేసులు, అడ్డగోలుగా వ్యవహరిస్తే కోర్టులోనే తేల్చుకుంటామని, రెండు రోజుల క్రితం తిరుచానూరు ఘటనలో తిరుపతి కోర్టులో పోలీసులపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక ఎస్‌ఐని సస్పెండ్‌ చేయాలని, సీఐకి మెమో జారీ చేయాలని ఆదేశాలు ఇస్తామని చెప్పడాన్ని గుర్తు చేశారు. కోర్టుల్లో పోలీసులకు అడుగడుగునా అవమానాలు జరుగుతున్నా అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు ఎందుకు చేస్తారో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సీనియర్‌ జర్నలిస్టు శ్రీహరిని సోషల్‌ మీడియా కేసులో అక్రమంగా అరెస్టు చేసి, రహస్యంగా దాచి పెట్టాల్సిన అవసరం ఏముందని పోలీసులను ప్రశ్నించారు. పోలీసులు పారదర్శకంగా వ్యవహరించి ఉంటే ఆయన్ని దాచి పెట్టాల్సిన అవసరం ఉండేదికాదని, తప్పుడు కేసులు పెట్టినట్టు వారికి ముందే తెలుసు కాబట్టి ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టారని పేర్కొన్నారు. పోలీసుల్లో నిజాయితీ కనిపించడం లేదని, కుప్పం నుంచి గెలిచి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు దీనికి సమాధానం చెప్పాలన్నారు. మానవ హక్కుల గురించి ఎప్పుడూ మాట్లాడే చంద్రబాబు కుప్పం పోలీసులకు ఆ హక్కుల గురించి ఎందుకు నేర్పలేదో ప్రజల ముందు చెప్పాలన్నారు. పోలీసులు అక్రమంగా ఎంత మందిని అరెస్టులు చేసినా జైలుకు వెళ్లివచ్చిన ప్రతి ఒక్కరు జగనన్నకు సైనికులుగా మారుతారే తప్ప పారిపోయే పరిస్థితి లేదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement