లారీని ఢీకొన్న కారు | - | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొన్న కారు

Apr 16 2026 10:30 AM | Updated on Apr 16 2026 10:30 AM

● వ్యక్తి దుర్మరణం ● నుజ్జునుజ్జు అయిన కారు

● వ్యక్తి దుర్మరణం ● నుజ్జునుజ్జు అయిన కారు

తవణంపల్లె: మండలంలోని తిరుపతి– బెంగళూరు జాతీయ రహరాదిలో ఉన్న పట్నం ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి వద్ద బుధవారం ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొంది. దీంతో కారు నుజ్జు నుజ్జు అయింది. కారును నడుపుతున్న వ్యక్తి దుర్మరణం చెందాడు. ఏఎస్‌ఐ మురళి కథనం మేరకు... చిత్తూరు నగరం గిరింపేట గొడుగుమూరుకు చెందిన పి.శ్రీనివాసులు కుమారుడు పి.వెంకటసాయి బుధవారం మారుతి సుజికి కారులో బెంగళూరు వైపు వెళుతున్నాడు. పట్నం ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి వద్ద నియంత్రణ కోల్పోయి ముందు వెళ్తున్న లారీని వెనుక వైపున ఢీకొని ఎడమ వైపు ఉన్న డివైడర్‌ను ఢీకొన్నాడు. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. వెంకటసాయి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కారులో చిక్కుకుపోయిన మృతదేహాన్ని బయటకు తీయడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. అనంతరం మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. భార్య టి.నందినిప్రియాంక ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ఎర్రచందనం కేసులో

ఒకరికి ఐదేళ్లు జైలు

తిరుపతి లీగల్‌: ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో ఎర్రావారిపాళెం మండలం కే తిప్పిరెడ్డి గారిపల్లికి చెందిన వి.హరినాథరెడ్డికి ఐదేళ్లు జైలు శిక్ష, రూ.3 లక్షలు జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్‌ జడ్జి నరసింహమూర్తి బుధవారం తీర్పు చెప్పారు. కోర్టు లైజనింగ్‌ అధికారి హరినాథ్‌, ఎర్రావారిపాళెం సీఐ లోకేష్‌, కోర్టు కానిస్టేబుల్‌ శివ కథనం మేరకు.. 2016 సెప్టెంబర్‌ 30వ తేదీన ఎర్రచందనం అక్రమ రవాణాపై ఎర్రావారిపాళెం పోలీసులకు సమాచారం వచ్చింది. పోలీసులు ఎర్రావారిపాళెం మండలం, మర్రిపాటివారిపల్లి, గానుగచింత రోడ్డు, గాజులేరు వద్ద తనిఖీలు చేపట్టారు. నిందితుడు హరినాథరెడ్డితోపాటు మరో ఇద్దరు కలిసి వాహనంలో 63 కిలోల బరువున్న 5 ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. హరినాథరెడ్డిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి అతనికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. మరో ఇద్దరిపై కేసును కొట్టివేస్తూ తీర్పు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement