రోజూ చిత్తూరు మీదుగా వెళ్లే రైళ్లు – 19
ప్రయాణికుల సంఖ్యృ – 3,600
రిజర్వేషన్ ప్రయాణికులు – 300 పైన
రోజువారీ రైల్వేస్టేషన్ ఆదాయం
– రూ.3 లక్షలు
స్టేషన్ ర్యాంక్ – ఎన్‌ఎస్‌జీ–4
చిత్తూరు కార్పొరేషన్: పేరుకే జిల్లా కేంద్రం. ఇక్కడి నుంచి రవాణా సదుపాయాలు అంతంతమాత్రమే. స్థానిక రైల్వేస్టేషన్ సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఇక్కడి నుంచి రోజూ పదుల సంఖ్యలో రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. దేశంలో పలు ప్రముఖ నగరాలకు సైతం చిత్తూరు స్టేషన్ మీదుగా వెళ్తుంటాయి. అయితే ప్రధాన నగరాలకు వెళ్లే కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు చిత్తూరులో స్టాపింగ్ లేదు. ఇక్కడ ఆగని రైళ్ల కోసం ప్రయాణికులు చిత్తూరు నుంచి 30 కి.మీ దూరంలో ఉన్న తమిళనాడులోని కాట్పాడికి, లేదా 33 కి.మీ దూరంలో ఉన్న పాకాల, 72 కి.మీ దూరంలో ఉన్న తిరుపతికి వెళ్లి ఎక్కాల్సి వస్తోంది. ముఖ్యంగా చైన్నె ప్యాసింజర్ రైలు ఎప్పుడు వస్తోందో తెలియడం లేదు. వీటి పై ఇటు పాలకులు, అటు అధికారులు స్పందించకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.
కుప్పంకే ప్రాధాన్యత
కుప్పంలో పలు రైళ్లు ఆపాలని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ఇటీవల సీఎం చంద్రబాబు కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన ఆయన వాస్కోడగామ–వేలాంకణి, దాదర్‌సెంట్రల్–పాండిచ్చేరి ఎక్స్‌ప్రెస్‌లను కుప్పం రైల్వేస్టేషన్‌లో స్టాపేజ్ ఇచ్చే విధంగా ఆదేశాలు జారీచేశారు. కానీ జిల్లా కేంద్రంలో రైళ్లు ఆగకపోవడం, చైన్నెకి నేరుగా రైలు లేకపోవడం పై పట్టించుకోకపోవడం కొసమెరుపు.
ఎంపీ మిథున్‌రెడ్డి వినతి
చైన్నె –మదనపల్లె రోడ్డు మధ్య రైలు నడిచేలా కోవిడ్ సమయంలో రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. వీటి పై రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి రైల్వే మంత్రిని కలిసి వినతి చేశారు. ఈ రైలు చైన్నెలో ఉదయం 8 గంటలకు బయలుదేరి 11.25 గంటలకు చిత్తూరు చేరుకుని అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు మదనపల్లె రోడ్‌కు వస్తుందని, తర్వాత తిరిగి 2.45 గంటలకు మదనపల్లె రోడ్ నుంచి బయలుదేరి రాత్రి 8.55 గంటలకు చైన్నె సెంట్రల్ రైల్వేస్టేషన్ చేరుకునేలా షెడ్యూల్‌ను గతంలో నిర్ణయించారు. ఈ రైలును ప్రారంభిస్తే రెండు రాష్ట్రాలకు చెందిన చిత్తూరు, చైన్నె, మదనపల్లె వాసులకు ఎంతో సౌకర్యం ఉంటుంది.
ఈ సమస్య ఎప్పటికి తీరుతుందో?
కాట్పాడిలో ఆగే రైలు చిత్తూరులో ఆగితే నగరవాసుల కల తీరుతుందని పలువురు అభిప్రాయపడుతన్నారు. చిత్తూరు నుంచి దేశంలోని ముఖ్య నగరాలైన ఢిల్లీ, కలకత్తా, బాంబే, అహ్మదాబాద్‌తో పాటు నాగపూర్, బెంగళూరు వంటి నగరాలకు రైలు సదుపాయం ఉంది. కానీ వాటి కంటే తక్కువ దూరంలో ఉన్న చైన్నెకి రైలు సదుపాయం లేదు. చిత్తూరు నుంచి చైన్నెకి రైలు సదుపాయం కల్పించాలని చిత్తూరు స్మార్ట్ సీటీ డెవలప్‌మెంట్ సభ్యులు స్థానిక రైల్వేస్టేషన్‌లో ప్రజాభిప్రాయాలు తీసుకుని రైల్వేశాఖకు సైతం పంపారు. కానీ దీనిపై పాలకులు ఎలాంటి శ్రద్ధా చూపలేదు.
స్టేషన్ మాస్టర్‌కు అందజేస్తున్న సంతకాల జాబితా(ఫైల్)
వీటిని ఆపే దమ్ముందా?
తిరుపతి–రామేశ్వరం, హౌరా–పాండిచ్చేరి, ఓకా–రామేశ్వరం, తిరుపతి–రామేశ్వరం, టాటా–యశ్వంత్‌పూర్, కన్యాకుమారి, హఠియా–యశ్వంత్‌పూర్, హౌరా–పాండిచ్చేరి రైళ్లు చిత్తూరు మీదుగా వెళ్తుంటాయి. కానీ వీటికి ఇక్కడ స్టాపింగ్స్ లేవు. వీటిలో ప్రయాణించాలంటే పాకాల లేదా తిరుపతి, కాట్పాడికి వెళ్లి ఎక్కాల్సిందే.


