తిరుపతి అర్బన్: వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ నేతృత్వంలో రైల్వే రిక్రూట్‌మెంట్ గ్రూప్–డీ 2026 పోటీ పరీక్షలకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉచిత శిక్షణ ఉంటుందని బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి భరత్‌కుమార్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 23వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పారు. దరఖాస్తులను తిరుపతి ఎమ్మార్‌పల్లి బీసీ స్టడీ సర్కిల్, కృష్ణానగర్, ఎమ్మార్‌పల్లి కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. వంద మంది అభ్యర్థులకు 2 నెలల పాటు ఉచిత శిక్షణతోపాటు స్టయిఫండ్, స్టడీ మెటీరియల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైల్వే రిక్రూట్‌మెంట్ గ్రూప్–డీ పరీక్షలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉచిత శిక్షణ అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థుల ఎంపిక విధానం పదో తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఉంటుందని చెప్పారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ ఉచిత శిక్షణ తరగతులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన అభ్యర్ధులు తమ బయోడేటాతో పాటు పదో తరగతి మార్కు లిస్టులు, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్, రైల్వే రిక్రూట్‌మెంట్ గ్రూప్–డీ పరీక్షకు దరఖాస్తు చేసిన ఆన్‌లైన్ జిరాక్స్, 2 పాస్ పోర్ట్ సైజ్ పొటోలు జతపరచి ఇవ్వాలని స్పష్టం చేశారు. బీసీ స్టడీ సర్కిల్ 9441456039, 9346221553 నంబర్లలో సంప్రదించాలని చెప్పారు.
స్కూల్ వ్యాన్‌ను ఢీకొన్న ట్రాక్టర్
తిరుపతి రూరల్: మండలంలోని కేసీపేట పంచాయతీ భాగ్యనగరం వద్ద బుధవారం రాత్రి ఓ ప్రైవేటు స్కూల్ వ్యాన్‌ను ట్రాక్టర్ ఢీ కొంది. ఈ ఘటనలో స్కూల్ వ్యాన్ ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ట్రాక్టర్ డ్రైవర్ అతి వేగంగా ముందు వెళుతున్న వాహనాన్ని అధిగమించే క్రమంలో ఎదురుగా వచ్చే స్కూల్ వ్యాన్‌పైకి దూసుకు వెళ్లగా ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. తిరుపతి రూరల్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కదలలేని స్థితిలో వున్న స్కూల్ వ్యాన్‌ను నెమ్మదిగా పక్కకు తొలగించి వాహనాల రాకపోకలు పునరుద్ధరించారు. ఎవరికీ పెద్ద గాయాలు లేనందున అందరు ఊపిరిపీల్చుకున్నారు. రామచంద్రాపురం మండలం సి.రామాపురం వద్ద ఉన్న వెరిటాస్ సైనిక్ స్కూల్ వ్యాన్ పిల్లలను వదిలేసి తిరిగి పాఠశాలకు వెళుతుండగా ప్రమాదం జరిగినందున పెను ప్రమాదం తప్పింది.


