సీనియారిటీని విస్మరించి జూనియర్లకు బాధ్యతలా?
చిత్తూరు కలెక్టరేట్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షల విధుల్లో సీనియారిటీలను విస్మరించి జూనియర్లను నియమించడం దారుణమని ఆపస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ మండిపడ్డారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు జారీ చేసిన చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్ల నియామకాల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయన్నారు. వాటిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పున:సమీక్షించాలని డిమాండ్ చేశారు. రీ ఆర్డర్ల జారీకి రాష్ట్ర విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. సీనియర్ టీచర్లను పక్కన పెట్టి, కనీస అనుభవం లేని జూనియర్లకు చీఫ్ సూపరింటెండెంట్లుగా బాధ్యతలు కేటాయించడం సబబు కాదన్నారు. ఒకే పాఠశాల నుంచి పలువురు ఉపాధ్యాయులకు పరీక్ష విధులు కేటాయించారని, దీంతో బోధన, పరిపాలన స్తంభించే ప్రమాదం ఉందన్నారు. డీఈవో, డీవైఈవో, ఎంఈవోల క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం నుంచి నేరుగా పరీక్ష విధుల ఉత్తర్వులు జారీచేయడం వింతగా ఉందన్నారు. ఇలాంటి పద్ధతి గతంలో లేదని మండిపడ్డారు. ఎటువంటి అనుభవం లేని వారికి కీలక బాధ్యతలు ఇస్తే పరీక్షల నిర్వహణలో లోపాలు తలెత్తే అవకాశం ఉందన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారుల సమన్వయంతో సీనియారిటీ, అనుభవాన్ని ప్రాతిపదికన తీసుకుని పూర్తి పారదర్శకతతో కొత్త ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.


