ఏంటీ గోల?
చంద్రబాబు సర్కార్‌లో ఐవీఆర్‌ఎస్ సర్వేల జోరు
చిత్తూరు మండలం బీఎన్‌ఆర్ పేటలో ఐవీఆర్‌ఎస్ సర్వేలో సిబ్బంది
కాణిపాకం: ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, నిర్ణయాలు,వినతుల పరిష్కారంపై బాబు ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతోంది. లోటు పాట్లను తెలుసుకునేందుకు ఐవీఆర్‌ఎస్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ కాల్స్‌తో నేరుగా ప్రజలకే ఫోన్ చేసి అమలు తీరుపై అభిప్రాయ సేకరణ జరుగుతోంది. ఇంత వరకు బాగానే ఉన్నా .. ఏ ఒక్కటీ పరిష్కారం కాకపోవడం జనానికి చిర్రెత్తిస్తోంది.
చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో దాదాపు 2.5 లక్షల కుటుంబాలున్నాయి. ఆయా కుంటుంబాలు ప్రభుత్వం ద్వారా అనేక పథకాలు పొందుతున్నాయి. వివిధ సమస్యల నిమిత్తం సచివాలయం, మండల కార్యాలయానికి వెళ్తుంటారు. నిత్యం ఆస్పత్రులకు వెళ్లి వస్తుంటారు. సమస్యల పరిష్కారం నిమిత్తం జిల్లా అధికారులను కలిసి అర్జీలు ఇచ్చుకుంటున్నారు. లేకుంటే ఆన్‌లైన్‌లో అర్జీలు పెట్టుకుంటున్నారు. ఈ తరుణంలో వారు ఏమేర సంతృప్తికరంగా ఉన్నారో.. తెలుసుకోవడానికి ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతోంది. అయితే వారిచ్చే జవాబుకు మళ్లీ.. బదులురావడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.
అధికారుల బేజారు
ప్రధానంగా సచివాలయ సిబ్బంది సర్వేలతో కుస్తీ పడుతున్నారు. కొందరు డెప్యూటేషన్లపై మండలం, జిల్లా కార్యాలయాలకు పరిమితమయ్యారు. మిగిలిన ఒకరిద్దరూ కూడా మధ్యలో మీటింగ్‌లంటూ వెళ్లిపోతుంటారు. ఇక ప్రజాప్రతినిధుల పర్యటనలతో అరకొర సిబ్బంది అవస్థ పడుతున్నారు. ఇలాంటప్పుడు సేవల కోసం వెళ్లే ప్రజలకు సచివాలయం ఖాళీగా కనిపిస్తోంది. దీంతో మండల కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఇలాంటప్పుడు ప్రజలు ఫీడ్ బ్యాక్ అధికారులు, సిబ్బందిని తెగ టెన్షన్ పెట్టిస్తోంది. ఇలాంటప్పుడు సర్వేలకు పరిమితం కావాలా..? ప్రజలకు సేవ చేయాలా..? తెలియక తికమక పడిపోతున్నారు. గతంలో వలంటీర్లు చేసే పనులంతా తమ వద్ద చేయిస్తే ఎలా అని పలువురు లోలోపాల కుమిలిపోతున్నారు. కొందరు బహిరంగంగా చెప్పుకుని... రగిలిపోతున్నారు. జిల్లా అధికారులకు సైతం ఈ కాల్స్ తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయి. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో.. ఈ రకంగా బదులిస్తున్నారని, అయితే ఆ కాల్స్ అధికారుల కొంపు ముంచుతున్నాయని.. పలువురు తలలుపట్టుకుంటున్నారు.
చర్యలు శూన్యం
క్షేత్ర స్థాయిలో ఆ సమస్యలు అలానే ఉండిపోతున్నాయి. మార్పులు కనిపించకపోయినా మళ్లీ ఆ ఐవీఆర్‌ఎస్ కాల్స్ ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. కొంత మంది అధికారులు ప్రజా సమస్యలను ఆ చెవిలో విని..ఈ చెవిలో వదిలేస్తున్నారు. తప్పుచేసే అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్ష్యాలతో సహా చూపించినా చర్యలు శూన్యమని మండిపడుతున్నారు. ఆస్పత్రుల్లో డాక్టర్లు ఉండడం లేదని, డబ్బులు అడుగుతున్నారని ఐవీఆర్‌ఎస్ కాల్స్‌కు బదులిచ్చినా మార్పు కవడం లేదు. ఈ సర్వేలో అసంతృప్తి వ్యక్త పరచే వారు అధికంగా ఉంటున్నారు.
ఏంటీ గోల?


