అధిక చార్జీలపై కఠిన చర్యలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రైవేటు బస్సులు అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని డీటీసీ నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గత ఐదు రోజులుగా చేపడుతున్న తనిఖీల్లో అధిక చార్జీలు వసూలు చేసిన 30 బస్సులపై కేసులు నమోదు చేశామన్నారు. తద్వారా రూ.3 లక్షల మేర జరిమానా విధించినట్టు వెల్లడించారు. అలాగే పన్ను చెల్లించని, పర్మిట్ లేని 32 బస్సులను గుర్తించి రూ.2 లక్షల మేరకు జరిమానా వేసినట్టు పేర్కొన్నారు. ఈ తనిఖీలు వచ్చే సోమవారం వరకు కొనసాగుతాయన్నారు.
విద్యుత్ సమస్యలు పరిష్కారం
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో మంగళవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పరిధిలోని 40 సెక్షన్లలో అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను గుర్తించారు. అందులో భాగంగా 11 కేవీ ఫీడర్ల పరంగా 216 సమస్యలు, ట్రాన్స్‌ఫార్మర్ల పరంగా 17, ఎల్‌టీ లైన్ల పరంగా 283, సర్వీసు లైన్ పరంగా 20 కలిపి మొత్తం 536 సమస్యలను గుర్తించినట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇస్మాయిల్‌అహ్మద్ తెలిపారు. వాటిలో 54 సమస్యలను పరిష్కారించామన్నారు.
విద్యుత్ సమస్యలు తెలియజేయండి
పెనుమూరు(కార్వేటినగరం): జనబాట కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లోకి వస్తున్న విద్యుత్ సిబ్బందికి సమస్యలు తెలియజేసి, పరిష్కరించుకోవాలని ఎస్‌ఈ ఇస్మాయిల్‌అహ్మద్ సూచించారు. ఎస్పీడీసీఎల్ జనబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం పెనుమూరు మండలం, పులికల్లు గ్రామంలో పర్యటించారు. అనంతరం ఎస్‌ఈ మాట్లాడుతూ గ్రామాల్లో ఎన్నో రోజులుగా పరిష్కారం కాని సమస్యలను గుర్తించి, వాటిని తక్షణం పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఆయన వెంట ఏడీఈ శేషాద్రిరెడ్డి, ఏఈ తులసీప్రసాద్, ఎల్‌ఐ పద్మనాభనాయుడు, ఎల్‌ఎం రవి ఉన్నారు.
వైద్య సేవలు మెరుగుపడాలి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలను మెరుగుపరచాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ సుధారాణి ఆదేశించారు. చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ జమ, ఖర్చు లెక్కలు పక్కాగా ఉండాలన్నారు. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులను పీహెచ్‌సీల్లో విధిగా చేపట్టాలన్నారు. గర్భిణులకు అభా నమోదు తప్పనిసరి అన్నారు. ఎన్‌సీడీ–4.0 ద్వారా స్క్రీనింగ్ చేయించాలన్నారు. సమావేశంలో జిల్లా క్షయ నివారణ అధికారి వెంకటప్రసాద్, డీఐఓ హనుమంతరావు, అధికారులు అనిల్‌కుమార్, ప్రవీణ, అనూష, జార్జ్, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.


