పంటల్లేవు, పథకాలు రావు.. ఇంకెక్కడ పండగ?
కళతప్పిన సంక్రాంతి
రాష్ట్రం అప్పులు రూ.3 లక్షల కోట్లు
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని
నీరుగారుస్తున్నారు
నిశ్శబ్దంగా చంద్రబాబు రాయలసీమ ప్రజల గొంతు కోస్తున్నారు
మాజీ మంత్రి ఆర్కేరోజా ధ్వజం
నగరి : ‘ఎరువులు, యూరియా అందక, సబ్సిడీ విత్తనాలు లేక, పంటలు చేతికి రాక, వచ్చినా గిట్టుబాటు ధరలేక, ఇచ్చిన హామీలు ఏవీ అమలుగాక రైతుకు భవిష్యత్తే లేకుండా పోయింది. పంటల్లేవు.. పథకాలు రావు.. ఇంకెక్కడ పండగ అనే స్థాయికి రైతులు చేరుకున్నారు.. సంక్రాంతి కళతప్పి కనిపిస్తోంది’ అని మాజీ మంత్రి ఆర్కేరోజా ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం నగరిలోని తన నివాస కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి పార్టీ శ్రేణుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. అందరికీ పార్టీ క్యాలెండర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్టంలో రైతులకు దిక్కుతెలియని పరిస్థితి నెలకొందన్నారు. సాగు వ్యయం పెరిగి పంట ఆదాయం తగ్గిందన్నారు. సాగు నుంచి పంట కోత వరకూ అప్పులు చేసుకుని తిప్పలు పడుతున్నారన్నారు. రైతుకు ప్రధాన పండుగైన సంక్రాంతిని జరుపుకోవడానికి ఖర్చులకు లేక రైతే భయపడే పరిస్థితి నెలకొందన్నారు.
రాయలసీమ ప్రజల గొంతుకోయొద్దు
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని.. మాజీ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. జగనన్న 80 శాతం పూర్తి చేసిన పనులను అటకెక్కించేసిందన్నారు. కరువు ప్రాంతాలకు శాశ్వత నీటిపరిష్కారానికి చేపట్టిన పనులకు గండికొట్టిందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేశామని చెప్పేంత వరకు చంద్రబాబు కుట్ర బయటపడలేదన్నారు. నిశ్శబ్దంగా చంద్రబాబు రాయలసీమ ప్రజల గొంతుకోసేస్తున్నారన్నారు.
మంచి చేయడమంటే ఇదేనా?
ఎన్నికల్లో ఈవీఎంలను మేనేజ్ చేసి, వీవీపాట్స్‌ను చించికాల్చేసి అవకతవకలకు పాల్పడి అధికారంలోకి వచ్చి చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు చేసే మంచి ఇదేనా అని ఆర్కే రోజా ధ్వజమెత్తారు. పాలక ప్రభుత్వ వైఫల్యాలతో రాష్ట్రం ఎంత నష్టపోతోందో, ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతోందో ప్రజలకు విడమరచి చెప్పాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. రాయలసీమను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. పార్టీని పటిష్ట పరచుకోవడం కోసం ప్రతి ఒక్కరూ సైనికుల్లా పోరాడాలన్నారు. పార్టీకి నష్టం వచ్చే పనులకు పాల్పడితే వారు కూర్చున్న కొమ్మను వారు నరుక్కున్నట్లే అన్నారు. ఈ సమావేశంలో పుత్తూరు మున్సిపల్ చైర్మన్ హరి, నగరి, పుత్తూరు ఎంపీపీలు భార్గవి, మునివేలు, నియోజకవర్గ స్థాయిలో ప్రజాప్రతినిధులు, పార్టీ కమిటీ నేతలు, అనుబంధ కమిటీ నేతలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
పంటల్లేవు, పథకాలు రావు.. ఇంకెక్కడ పండగ?


