సంపద సృష్టి.. ప్రైవేటీకరించడమేనా?
చంద్రబాబు హామీలను నమ్మితే మోసపోవడమే కూటమి ప్రభుత్వానికి ఓటమి తప్పదు అభివృద్ధి, సంక్షేమం మరిచి వేధింపులకే పరిమితమైన ప్రభుత్వం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పుంగనూరు : సంపద సృష్టించడం అంటే ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరించడమా? అని మాజీ మంత్రి , ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. ఆది వారం ఆయన పట్టణంలో వైద్యకళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్‌సీపీ నిరసన పోస్టర్లను ఆవిష్కరించారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో సంపద సృష్టిస్తా....పేదలకు పంచుతా... అని ఊకదంపుడు ప్రసంగాలు ఇచ్చిన చంద్రబాబు ఆ సంపద సృష్టి ఎలా ఉంటుందో గత సీఎం వైఎస్ జగన్‌ను చూసి నేర్చుకోవాలన్నారు. ప్రభుత్వ రంగంలో ఆస్తులను అభివృద్ధి పరిచి, వాటి ద్వారా సంపద పెంచాల్సింది పోయి, వేల కోట్ల ప్రభుత్వ సంపద ప్రైవేటు వ్యక్తులకు దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు, ధనికుల మధ్య ఆర్థిక అసమానతలు తొలగించడంలో ఐదేళ్లలో జగన్‌మోహన్‌రెడ్డి చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. దీనిని దేశం మొత్తం గుర్తించిందని కొనియాడారు. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లుగా ప్రజలకు అందించిన ఘనత వైఎస్.జగన్‌కు దక్కుతుందన్నారు. దీనిపై ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ప్రజల మధ్య విభేదాలు సృష్టించిందని విమర్శించారు. దీనిపై జగన్ తాను పేదల పక్షాన ఉన్నానని, ఇది క్లాస్‌వార్ అని ఆయన సీఎంగా ఉన్నప్పుడే ప్రకటించారని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు క్లాస్‌వార్ ఏమిటో చేతల్లో నిరూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. పేదల కోసం జగన్ నిర్మించిన 17 వైద్య కళాశాలలను సంపన్నులకు కట్టబెట్టి, పేద విద్యార్థులకు తీరని ద్రోహం చేస్తున్నారని పెద్దిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమల పేరుతో విలువైన భూములను కారుచౌకగా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం , సంపదను దోచిపెట్టడం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో చంద్రబాబు హామీలు ఇచ్చారంటే , అధికారంలోకి వచ్చాక వాటిని పక్కన బెట్టి ప్రజలను మోసం చేయడమేనన్న విషయం మరోసారి స్పష్టమైందని అన్నారు. పేదల ఆర్థిక అభివృద్ధికి దోహదపడే పథకాలను జగన్ అమలు చేస్తే.....చంద్రబాబు హామీలతో మోసం చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రాకతో ప్రతిపక్షంపై అక్రమ కేసులు పెట్టి వేటాడటం, వేధించడం విధిగా చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈనెల 12న జరగనున్న నిరసన ర్యాలీకి ప్రతి ఒక్కరూ వేల సంఖ్యలో పాల్గొని , జయప్రదం చేయాలని పెద్దిరెడ్డి కోరారు. సమావేశంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు అనీషారెడ్డి, కొండవీటి నాగభూషణం, శ్రీనాథరెడ్డి, మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా , ఎంపీపీ భాస్కర్‌రెడ్డి, సీమ జిల్లాల మైనార్టీ సెల్ కన్వీనర్ ఫకృద్ధిన్‌షరీఫ్, జిల్లా వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్ అమ్ము, జెడ్పీటీసీ దామోదర్‌రాజు, పార్టీ నాయకులు ఆవుల అమరేంద్ర, చంద్రారెడ్డి యాదవ్, సంపల్లి బాబు, ఖాదర్, రాజేష్, తేజ పాల్గొన్నారు.
సంపద సృష్టి.. ప్రైవేటీకరించడమేనా?


