ఇల్లు కూలిపోయింది
మాకు ఇప్పటికే వయసు మీదపడింది. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నాం. పూరింట్లో జీవనం సాగిస్తున్నాం. ఇటీవల జరిగిన రాయలచెరువు ఘటనలో నీటి ప్రవాహానికి మా పూరిల్లు కూలిపోయింది. మేము ప్రాణంతో బతక గలిగాం అంటే దేవుడి దయే. ప్రస్తుత పరిస్థితిల్లో ఈ ఇంటిని బాగు చేసుకునేందుకు మాకు స్తోమత లేదు. ప్రభుత్వం స్పందించి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలి. అలాగూ నెల తం రూ.40 వేలతో పాలిచ్చే ఆవును కొన్నాం. అది కూడా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మృత్యువాత పడింది. దీనికి నష్టపరిహారం చెల్లిస్తే మా జీవనోపాధికి ఉపయోగపడుతుంది. – మునివేలు, సూర్యపుత్రి
ఇల్లు గడవడమే కష్టంగా మారింది
నేను టమాటా వ్యాపారం చేస్తుంటా. నా భార్య పశుపోషణతో చేదోడుగా ఉంటుంది. రోజూ మదనపల్లె నుంచి టమాటాలను తీసుకువచ్చి పలు దుకాణలు సరఫరా చేస్తుంటా. రాయలచెరువు కట్ట తెగిన రోజు ఇంటి వద్ద 80 బాక్సుల టమాటా ఉంది. నీటి ప్రవాహానికి మొత్తం పోయింది. టమాటా రవాణాకు వినియోగించే వాహనానికి వాయిదాలు కట్టేందుకు ఇంట్లో ఉంచిన రూ.50వేలు కొట్టుకుపోయాయి.అలాగే ఆరు గేదెలు మృతి చెందాయి. పైసా పైసా కూడబెట్టుకుని కుటుంబాన్ని నెట్టుకొచ్చే మాకు ఈ విపత్తు కారణంగా రూ.5లక్షల నష్టం వాటిల్లింది. ప్రస్తుతం టమాటా వ్యాపారం చేసేందుకు చేతిలో చిల్లిగవ్వ లేదు. ప్రస్తుతం ఇల్లు గడవడమే కష్టంగా మారింది. – సౌందరరాజ్, అముద, కళత్తూరు దళితవాడ
ఉపాధి పోయింది
నాతో పాటు గ్రామంలో మరో పదిమందికి బీడీలు చుట్టడం ద్వారా ఉపాధి కల్పిస్తున్నా. రాయలచెరువు తెగి మా గ్రామాన్ని నీటి ప్రవాహం ముంచెత్తింది. దీంతో మా ఇంటి వద్ద నిల్వ చేసిన 15 బస్తాల బీడీ ఆకు, 8 బస్తాల పొగాకు, 53 వేల బీడీలు కొట్టుకుపోయాయి. అంతేకాకుండా ఇంట్లోని వస్తువులు సైతం ప్రవాహంలో వెళ్లిపోయాయి. ఈ విపత్తు కారణంగా మాకు సుమారు రూ.2.5లక్షల వరకు నష్టం వాటిల్లింది. నాకు ఉపాధి పోయింది. ప్రస్తుతం పెట్టుబడికి చేతిలో పైసా లేని పరిస్థితి. నేను గుండె జబ్బుతో బాధపడుతున్నా. ఇటీవలే యాంజియోగ్రామ్ కూడా చేశారు. వయసు మీద పడింది. ఇప్పుడు ప్రభుత్వం చేయూతనందించాలి. – ఎన్.విజయ్ కుమార్
కోలుకోలేని నష్టం
రాయలచెరువు తెగిన ఘటనలో నీటి ప్రవాహం కారణంగా మా కుటుంబానికి రూ.15 లక్షల నష్టం వాటిల్లింది. మాకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడికి చెందిన 10 పశువులు, చిన్నవాడికి చెందిన 9 పశువులు ఉప్పెన ఉధృతికి మృత్యువాత పడ్డాయి. రెండు ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకు వాటి ఆచూకీ తెలియలేదు. 20 బస్తాలు బియ్యం నీటి పాలైంది. మా పశువుల కొట్టంలో మూడు లేగదూడలు మాత్రమే మిగిలాయి. వాటికి పాలిచ్చే గేదెలు మృతి చెందడంతో బయటి నుంచి పాలు కొనుగోలు చేసుకుని ఆకలి తీరుస్తున్నాం. ఈ విపత్తు కారణంగా కోలుకోలేని నష్టం వాటిల్లింది. ప్రభుత్వం సాయం చేస్తే కానీ, కుదుటపడలేం. – నగరం మురగయ్య, సుశీలమ్మ
అంతా పోయింది
రాయలచెరువుల ఘటనలో మాకు అంతా పోయింది. ఏమీ మిగలలేదు. ఇంట్లోని వస్తువులు, పిల్లల సర్టిఫికెట్లు, పాసు పుస్తకాలు, గుర్తింపు కార్డులు గల్లంతయ్యాయి. నాకున్న పది ఆవుల్లో ఏడు మృత్యువాత పడ్డాయి. పంట సాగుకు తెచ్చిపెట్టుకున్న వరి విత్తనాలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. దాదాపు రూ.3లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. ఇలాంటి కష్ట సమయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మాలాంటి బాధితులను ఆదుకోవాలి. మా కళత్తూరు దళితవాడ లోతట్టు ప్రాంతంలో ఉంది. మాకు మిట్ట ప్రాంతంలో ఇంటి స్థలాలు మంజూరు చేయాలి. – కె.సుబ్రమణ్యం
ఇల్లు కూలిపోయింది
ఇల్లు కూలిపోయింది
ఇల్లు కూలిపోయింది
ఇల్లు కూలిపోయింది


