వైఎస్ జగన్ ఇచ్చింది రూ.లక్ష కోట్ల ఆస్తి
పుంగనూరు: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మెడికల్ కళాశాలల రూపంలో రాష్ట్ర ప్రజలకు రూ.లక్ష కోట్ల ఆస్తి సృష్టించారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న ర్యాలీ పోస్టర్లను ఆదివారం పుంగనూరులో పెద్దిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఒకేసారి 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టిన ఘనత వైఎస్ జగన్‌కు దక్కుతుందన్నారు. వైఎస్ జగన్ హయాంలోనే ఏడు కాలేజీలు పూర్తయ్యాయని, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. రూ.5వేల కోట్లు ఖర్చు చేస్తే అన్ని కాలేజీలు వినియోగంలోకి వస్తాయన్నారు. తద్వారా ప్రభుత్వ మెడికల్ కళాశాలల ఆస్తి విలువ రూ.లక్ష కోట్లు అవుతుందని, ఇది ప్రజలకు వైఎస్ జగన్ ఇచ్చిన ఆస్తి అన్నారు. వీటి పనులు పూర్తి చేయకుండా చంద్రబాబు ప్రైవేటీకరణకు చర్యలు తీసుకున్నారని, దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. పేదలకు వైద్యం, వైద్య విద్య దూరమవుతాయని ఆగ్రహంవ్యక్తంచేశారు. ధనవంతులు, విదేశాల్లో ఉన్నవారు, పొరుగు రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడ వైద్య కళాశాలల్లో సీట్లు పొంది చదువుకుంటారని, విద్య పూర్తయిన తర్వాత వారి స్వస్థలాలకు లేదా విదేశాలకు వెళ్లిపోతారని, దీనివల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఏమీలేదన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో వైద్యం, విద్య ఉండాలని వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడితే, ఇప్పుడు వాటిని చంద్రబాబు పీపీపీ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేస్తున్నారన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ ఈ నెల 12న నియోజకవర్గ స్థాయి ర్యాలీని విజయవంతం చేయాలని పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ రెడ్డప్ప, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు అనీషారెడ్డి, కొండవీటి నాగభూషణం, పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.


