
కుప్పం.. ఉద్యోగులు హడల్
కుప్పం అంటేనే ఉద్యోగులు హడలిపోతున్నారు. సీఎం నియోజకవర్గం అయితే ఇన్ని ఒత్తిళ్లా..మమ్మల్ని వదిలేస్తే వెళ్లిపోతాం అంటూ ఉద్యోగులు మనోవేదనకు గురవుతున్నారు. నియోజకవర్గంలో పనిచేస్తున్న ఉద్యోగులకు అధికార పార్టీ నేతలు చేస్తున్న ఒత్తిళ్లు తాళలేక దీర్ఘకాలిక సెలవుపై వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు.
కుప్పం : ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఉన్నతాధికారులు ఓ వైపు.. అధికార పార్టీ నేతలు మరో వైపు చేస్తున్న ఒత్తిళ్లతో కుప్పంలో పనిచేయలేకపోతున్నామని అధికారులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కడా కార్యాలయ సిబ్బంది సైతం పేపర్ వర్కులు చేయలేక పోతున్నామని మదన పడుతున్నారు. నిత్యం ప్లానింగ్ , సర్వే, నివేదికలతోనే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భూముల సేకరణతో ఇక్కట్లు
రెవెన్యూశాఖలో భూ సమస్యల పరిష్కరించాలని ఇబ్బందులు పెడుతూ..మరోవైపు పలు పరిశ్రమలకు, సోలార్ ఏర్పాటుకు భూములు సేకరించాలని ఒత్తిళ్లు చేస్తుండడంతో తట్టుకోలేకపోతున్నారు. నియోజకవర్గంలోని రైతులు చిన్న, సన్నకారు రైతులు ఉన్నారు. వీరి వద్ద నుంచి భూములు సేకరించాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నారు. ఎకరా, రెండెకరాలు కలిగిన రైతుల ఆవేదన మనస్సును కలచి వేస్తోంది. ప్రోహిభిషన్ ఎకై ్సజ్ శాఖలో సిబ్బంది కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు ప్రభుత్వం నిబంధనలకు విరుద్దంగా మద్యం విక్రయాలు పెంచాలని ఒత్తిడి అక్రమ రవాణాను అడ్డుకుంటే అధికార పార్టీ నేతలు సిపార్సులు అధికం కావడంతో అధికారులు నలిగిపోతున్నారు. కుప్పం మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. తెల్లవారు జామున ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా పనిభారంతో విశ్రాంతి లేకుండా చేస్తున్నామంటూ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయితీరాజ్, ఆర్‌అండ్‌బీలో ప్లానింగ్‌లు, ప్రతిపాదనలే తప్ప అభివృద్ధి పనులు మాత్రం కానరావడంలేదు. ఏడాదిగా సమీక్షలు, సమావేశాలకు పరిమితం అవుతున్నారు గాని పనులు మాత్రం కార్యారూపం దాల్చడం లేదు.
బెదిరింపులతో భయపడిపోతున్నారు
కుప్పానికి బయట ప్రాంతాల నుంచి అధికారులు రావాలంటే భయపడుతున్నారు. అధిక పనిభారం, ఒత్తిళ్లు , బెదరింపులు అధికంగా ఉంటాయని అధికారుల వాదన. నెల రోజుల క్రితం జిల్లా వ్యాప్తంగా సచివాలయ సిబ్బంది బదిలీలు నిర్వహించారు. కుప్పం నియోజకవర్గంలో అక్కడికక్కడే సర్దుబాటు చేశారు. బయట ప్రాంతాల నుంచి ఎవ్వరూ రాలేదు. రెండు , మూడు సచివాలయాలకు ఒక్కరే కార్యదర్శులు, వీఆర్‌ఓలు ఇన్‌చార్జులుగా పనిచేస్తున్నారు. కుప్పం ఎంపీడీఓ పోస్టు ఖాళీగా ఉండి 5 నెలలు గడుస్తున్నా, భర్తీ కాలేదు. కుప్పం ఎంఈఓ సైతం ఇన్‌చార్జి పోస్టుకే పరిమితం అయింది.
అమ్మో.. పనిచేయలేం!
సీఎం ఇలాకలో ఉద్యోగులపై తీవ్ర ఒత్తిళ్లు
సెలవుపై వెళ్లేందుకు సిద్ధమవుతున్న అధికారులు
కుప్పం వచ్చేందుకు ససేమిరా అంటున్న ఉద్యోగులు
అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు తాళలేకపోతున్న అధికారులు
చేయలేక.. ఉండలేక..
అధికార పార్టీ నేతలు మాటలు వినకపోతే బదిలీ ఉండదు.. నేరుగా సస్పెన్షకు బలి కావాల్సిందే. గతంలో కుప్పం అర్బన్ సీఐగా, కుప్పం ఎంఈఓల సస్పెన్షన్ ఈ కోవకు చెందిందే. స్థానికంగా స్థిర పడిన ఉద్యోగులు బయట ప్రాంతాలకు వెళ్లలేకుండా భయపడుతూ పనిచేయాల్సిన పరిస్థితి కుప్పం నియోజకవర్గంలో నెలకొంది. ఆర్టీసీలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు సైతం రాజకీయాలకు బలైపోయారు. రోజురోజుకు అధికార పార్టీ నేతల ఆగడాలు మితిమీరి పోవడంతో కుప్పం నియోజకవర్గంలో అధికారులు పనిచేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.