
నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ
● నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ ● పరీక్ష కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు ● జిల్లాలో 35 పరీక్ష కేంద్రాలు ● హాజరుకానున్న 15,377 విద్యార్థులు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు ఇంటర్మీడియట్ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. ఈనెల 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను లోపలికి అనుమతించరాదని బోర్డు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
పరీక్షా కేంద్రాలపై ప్రత్యేక నిఘా
పరీక్ష కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. జిల్లాలోని పరీక్షలు నిర్వహించే 35 పరీక్ష కేంద్రాల్లో ప్రతి గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని ఆన్‌లైన్‌న్ స్ట్రీమింగ్ చేయనున్నారు. కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి అధికారులు పర్యవేక్షించనున్నారు.
జిల్లా సమాచారం
మొదటి సంవత్సరం విద్యార్థులు (జనరల్) 10,236
ద్వితీయ సంవత్సరం విద్యార్థులు (జనరల్) 3,724
మొదటి సంవత్సరం (ఒకేషనల్) 810
ద్వితీయ సంవత్సరం (ఒకేషనల్) 607
మొత్తం విద్యార్థులు 15,377
పరీక్ష కేంద్రాలు 35
ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా
ఇంటర్మీడియట్ విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేశాం. పరీక్షల నిర్వహణలో తప్పిదాలు చోటు చేసుకుంటే కఠిన చర్యలుంటాయి. కేంద్రాల్లో ఎలాంటి పొరపాట్లు జరిగినా సీఎస్, డిపార్ట్‌మెంటల్ అధికారులదే బాధ్యత. – శ్రీనివాసులు,
ఇంటర్మీడియట్ డీఐఈవో, చిత్తూరు

నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ