‘పొదుపు’ డబ్బులు రూ.32 లక్షలు స్వాహా
పుంగనూరు : చిత్తూరు జిల్లా పుంగనూరు మున్సిపాలిటీ పరిధిలోని ఒక ఆర్పీ.. మహిళలు ప్రతి నెలా పొదుపు చేసిన రూ.32 లక్షలను స్వాహా చేశారని మంగళవారం గ్రూపు మహిళలు పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్‌కు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పుంగనూరు పట్టణంలోని వైభవ్ లక్ష్మీ సమాఖ్యలో 280 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. రెడ్డిరాణి తన చేతివాటం ప్రదర్శించి, మహిళల వద్ద వసూలు చేసిన రూ.32 లక్షల రూపాయలు గత ఏడాది కాలంగా బ్యాంకులో పొదుపు చేయకుండా స్వాహా చేశారు. దీనిపై సభ్యులకు అనుమానం వచ్చి బ్యాంకు ఖాతాలను పరిశీలించగా పొదుపు చేసిన నిధులు బ్యాంకులో జమ కాకపోవడంతో స్వాహా అయినట్లు నిర్ధారించుకున్నారు. మంగళవారం పుంగనూరుకు వచ్చిన డీఎస్పీకి మహిళా సంఘం సభ్యులు ఫిర్యాదు చేశారు. సమావేశంలో సీఐ రామ్‌భూపాల్, ఎస్‌ఐ లోకేష్ పాల్గొన్నారు.


