అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో అమలవుతున్న ఉపాధి హామీ పనుల్లో అవినీతికి పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో డ్వామా పరిధిలో అమలవుతున్న ఉపాధి హామీ పథకంపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఎంజీఎన్‌ఆర్‌జీఎస్ పథకంలో రూ.150 కోట్లతో మెటీరియల్ కాంపొనెంట్ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
50 శాతం కరువు ప్రాంతాలు
2024–25 ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో 50 శాతం ప్రాంతాలను కరువు ప్రాంతాలుగా గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని 50 శాతం మండలాల్లో భూగర్భ జలవనరులు తగ్గడాన్ని గుర్తించామన్నారు. ఉపాధి హామీ పథకంలో ఫారమ్‌పాండ్‌ల నిర్మాణం చేపట్టి భూగర్భ నీటి మట్టాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందులో 2025–26 సంవత్సరానికి జిల్లాలో 13 వేల ఫారమ్‌పాండ్‌లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఒక్కో ఫారమ్ పాండ్‌లో లక్ష లీటర్ల నీటిని నిల్వ చేయడంతోపాటు భూగర్భజల మట్టాన్ని పెంచవచ్చని చెప్పారు.
ఎస్సీ,ఎస్టీ ప్రాంతాలకు ప్రాధాన్యం
జిల్లాలో నిర్వహిస్తున్న ఉపాధి పనుల్లో ఎస్సీ, ఎస్టీ ప్రాంతాలకు ప్రాధాన్యమిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. చిత్తూరు–వేలూరు, యాదమరి–చిత్తూరు రోడ్డు, పలమనేరు నియోజకవర్గంలో బీటీ రోడ్ల నిర్మాణం, 25 స్కూల్ కాంపౌండ్ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. నీటి ట్యాంకర్ల అవసరం లేకుండా వేసవిలో తాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో డ్వామా పీడీ రవికుమార్ పాల్గొన్నారు.


