● స్కూటర్ చోరీ కేసులో విచారిస్తే.. దోపిడీ దొంగలు దొరికారు ● వివరాలు వెల్లడించిన ఎస్పీ మణికంఠ
చిత్తూరు అర్బన్: తీగ లాగితే.. డొంక కదిలినట్టు.., ఓ ద్విచక్రవాహనం చోరీ కేసులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు మోస్ట్ వాంటెడ్ దొంగలు దొరికారు. ఈ మేరకు గల్లా హేమచంద్ర (27), కొండరాజు సురేష్ (27), షేక్ మస్తాన్ (24), పోలి వరప్రసాద్ (20), సంజయ్ కుమార్ (23) అనే ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఒక్కొక్కరిపై 60, 57, 27 కేసులున్న కరుడుగట్టిన నేరగాళ్లతోపాటు.. రూ.35 లక్షల విలువైన బంగారు వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. మంగళవారం ఈ మేరకు చిత్తూరు నగరంలోని పోలీసు అతిధిగృహంలో ఎస్పీ మణికంఠ చందోలు, ఏఎస్పీ రాజశేఖర్‌రాజు, డీఎస్పీ సాయినాథ్, పూతలపట్టు సీఐ కృష్ణమోహన్‌తో కలిసి మీడియాకు వివరాలను వెల్లడించారు. ఈనెల 6వ తేదీన పూతలపట్టులో పార్కింగ్ చేసిన తన మోటారు సైకిల్ కనిపించడంలేదని బాధితుడు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుని, లభించిన కొద్దిపాటి ఆధారాలతో దర్యాప్తు ప్రారంభించారు. తొలుత తవణంపల్లె మండలం జెట్లిపల్లె, పల్లెచెరువు పంచాయతీకు చెందిన గల్లా హేమచంద్రను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో అనుమానితుడిపై చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, బద్వేలు ప్రాంతాల్లో దాదాపు 60కు పైగా కేసులు ఉన్నట్లు, అందులోనూ 20 కేసుల్లో నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో ప్రకాశం జిల్లా సీఎస్ పురానికి చెందిన సురేష్ (ఇతడిపై 27 కేసులు), తిరుపతి జిల్లా పుత్తూరుకు చెందిన షేక్ మస్తాన్ (57 కేసులు), సత్యసాయి జిల్లా ఓడిసికి చెందిన వరప్రసాద్, చిత్తూరు రూరల్ మండలం తాళంబేడుకు చెందిన సంజయ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. ఇళ్లలో దొంగతనాలు, చైన్‌స్నాచింగ్, ఆలయాల్లో హుండీల చోరీ, స్కూటర్లను అపహరించండం వంటి కేసుల్లో నిందితులు తప్పించుకుని తిరుగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితులు చోరీలు చేసి దాచి ఉంచిన రెండు ద్విచక్ర వాహనాలు, 316 గ్రాముల బంగారు ఆభరణాలు, 3.150 కిలోల వెండి ఆభరణాలు, ఓ టీవీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరుతో పాటు ఇతర జిల్లాల్లో వీటిని చోరీ చేసినట్లు తెలిపారు. కేసు ఛేదించడంలో ప్రతిభ చూపించిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
తీగ లాగితే.. డొంక కదిలింది!