
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో గత ఏడాది ప్రారంభించిన అసోసియేట్ ప్రోగ్రామ్ నుంచి దాదాపు 500 మంది జూనియర్ స్థాయి ఉద్యోగులను తొలగించింది. జొమాటో అసోసియేట్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ (జాప్)లో భాగంగా గత ఏడాది 1,500 మందిని కస్టమర్ సర్వీస్ రోల్స్ కోసం నియమించుకుంది. ఈ ఉద్యోగులను ఆపరేషన్స్, మార్కెటింగ్, సేల్స్, సప్లై చైన్‌తో సహా వివిధ విభాగాల్లో సేవలకు ఉపయోగించుకుంది. ప్రస్తుతం జాప్‌లో ఉన్న వారిలో 1,000 మందిని కొనసాగించాలని, మిగతావారి(సుమారు 33 శాతం మంది) పనితీరు సరిగా లేదనే కారణంతో లేఆఫ్స్ ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.
లేఆఫ్స్‌కు కారణం
పనితీరు సరిగా లేకపోవడం, సమయపాలన పాటించకపోవడం వంటి కారణాలతో ఈ ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఉద్యోగం కోల్పోయిన వారికి నష్టపరిహారంగా రెండు నెలల వేతనం ఇచ్చినట్లు చెప్పాయి. అయితే కొందరికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఉద్యోగం నుంచి తొలగించారని సోషల్ మీడియా వేదికగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
పెరుగుతున్న పోటీ
ఈ పరిణామంపై జొమాటో స్పందించలేదు. ఇటీవల తన మాతృసంస్థ పేరును ఎటర్నల్‌గా మార్చిన జొమాటోకు పెరుగుతున్న పోటీ, క్విక్ కామర్స్‌లో వస్తున్న మార్పుల వల్ల లాభాలు క్షీణిస్తున్నాయి. 2024 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 57 శాతం క్షీణించి రూ.59 కోట్లకు పరిమితమైంది. క్విక్ కామర్స్ బిజినెస్ వేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ జొమాటోకు అతిపెద్ద ఆదాయ వనరుగా ఉన్న ఫుడ్ డెలివరీ విభాగం వృద్ధి మందగిస్తుంది. ఫుడ్ డెలివరీలో వ్యవస్థాగత సమస్యలను పరిష్కరించడానికి కంపెనీ చర్యలు తీసుకుంటుందని కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ ఇటీవల ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
ఇదీ చదవండి: మార్చిలో వాహన విక్రయాలు ఎలా ఉన్నాయంటే..
ఈ త్రైమాసికంలో జొమాటో ఉద్యోగుల బెనిఫిట్ వ్యయాలు(హెల్త్‌కేర్, రిటైర్‌మెంట్ ప్లాన్లు, వెల్‌నెస్ ప్రోగ్రామ్‌లు, పెయిడ్ లీవ్‌లు..) ఏడాది ప్రాతిపదికన 63 శాతం పెరిగి రూ.689 కోట్లకు చేరాయి. మూడు నెలల కాలంలో కార్యకలాపాల ద్వారా రూ.5,405 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2024 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం మార్చి 31, 2024 నాటికి 8,244 మంది ఉద్యోగులు ఉన్నారు.