
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరుగుతుండడంతో ఉద్యోగాలను ఆటోమేట్ చేస్తూ చాలా కంపెనీలు భారీగా లేఆఫ్స్ విధిస్తున్నాయి. ఇటీవల సేల్స్‌ఫోర్స్ కంపెనీలో ఏఐ వినియోగం పెరిగిన నేపథ్యంలో 4,000 మంది కస్టమర్ సపోర్ట్ ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. ఇటీవల లోగాన్ బార్ట్‌లెట్ పాడ్‌కాస్ట్‌లో కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ బెనియోఫ్ ఈ లేఆఫ్స్‌ను ధ్రువీకరించారు. కంపెనీలోని ఉద్యోగులను 9,000 నుంచి 5,000కు తగ్గించినట్లు చెప్పారు.
ఉద్యోగుల తొలగింపుపై బెనియోఫ్ మాట్లాడుతూ..‘కంపెనీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరిగింది. క్లౌడ్ సాఫ్ట్‌వేర్ సర్వీసులు అందిస్తున్న మా కంపెనీ సపోర్ట్ డివిజన్‌లో దాదాపు 45 శాతం ఉద్యోగాల కోతలు అనివార్యం అయ్యాయి. దాంతో ఈ విభాగంలో గతంలో 9వేల మంది ఉన్న ఉద్యోగులను 5 వేలకు తగ్గించాం. 100 మిలియన్ లీడ్స్‌ను ఏఐ పరిష్కరిస్తోంది. మానవ శక్తి అవసరం తగ్గింది’ అని చెప్పారు. కంపెనీ అదనపు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, కస్టమర్ సర్వీస్ ఏజెంట్లు, లీగల్ అడ్వైజర్లను నియమించుకోదని బెనియోఫ్ జులైలో చెప్పారు. కానీ కంపెనీ వినియోగదారులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని స్వీకరించడంలో సహాయపడటానికి సేల్స్ సిబ్బందిని చేర్చుకుంటున్నట్లు స్పష్టం చేశారు. సేల్స్‌ఫోర్స్‌లో జనవరి 2025 నాటికి అన్ని డివిజన్లలో 76,453 మందిని నియమించింది. ఇటీవల 4,000 మందికి లేఆఫ్స్ ప్రకటించడంతో మొత్తం శ్రామిక శక్తిలో ఇది సుమారు 5% ప్రాతినిధ్యం వహించినట్లయింది.
అయితే జులై 2025లో ఓ కార్యక్రమంలో బెనియోఫ్ మాట్లాడుతూ.. కృత్రిమ మేధ సామూహిక నిరుద్యోగానికి దారితీయదని చెప్పడం గమనార్హం. కార్మికుల స్థానాన్ని భర్తీ చేయడానికి బదులుగా కృత్రిమ మేధ వాడకం పెరుగుతుందన్నారు. లేఆఫ్స్‌కు సంబంధించి రెండు నెలల క్రితం బెనియోఫ్ ఆంత్రోపిక్‌కు చెందిన డారియో అమోడి వంటి ఏఐ స్టార్టప్ సీఈఓలకు వ్యతిరేకంగా నిలబడ్డారు. ఉద్యోగ కోతల పట్ల నిరసన వ్యక్తం చేశారు. అలాంటిది తన కంపెనీలోనే ఇలా 4000 మందికి లేఆఫ్స్ ప్రకటించడం ఏంటని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: మోదీ కోసం చైనా ప్రతిష్టాత్మక వాహనం.. ప్రత్యేకతలివే..