Zomato: పిజ్జా డెలివరీపై అసంతృప్తితో

Zomato Inspired By Bad Pizza Order Placed By Founder Deepinder Goyal - Sakshi

జొమాటో ఎలా ప్రారంభం అయ్యిందంటే...

లక్ష కోట్లకు చేరిన జొమాటో మార్కెట్‌ విలువ 

సాక్షి, వెబ్‌డెస్క్‌: ఆఫీసులో పనిలో మునిగిపోయాడు ఓ ఉద్యోగి.. లంచ్‌ టైం దాటి పోయింది. బాగా ఆకలేస్తుంది.. బయటకు వెళ్లి తిందామంటే కుదరదు.. ఏం చేయాలి.. వంటరాని బ్యాచిలర్‌ బాబుకి వేడి వేడిగా బిర్యానీ తినాలనిపించింది.. ఏం చేస్తాడు.. పిజ్జా కావాలని ఇంట్లో పిల్లలు గోల.. అప్పుడా ఇల్లాలు ఏం చేస్తుంది.. ఈ ప్రశ్నల్నింటికి ఒక్కటే సమాధానం.. జొమాటో. చేతిలో మొబైల్‌ ఉంటే.. ప్రపంచం మన గుప్పిట్లో ఎలా ఉంటుందో.. సెల్‌ఫోన్‌లో జొమాటో యాప్‌ ఉంటే.. మన జేబులోనే రెస్టారెంట్‌, దాబా, చైనీస్‌ ఫాస్ట్‌ఫుడ్‌ ఇలా అన్ని ఉన్నట్లే.

దాదాపు 12 ఏళ్ల క్రితం ప్రారంభమైన జొమాటో స్టార్టప్‌ ఇప్పుడు మన దేశంలో నంబర్‌ 1 ఫుడ్‌ డెలివరీ యాప్‌గా నిలిచింది. కొన్ని రోజుల క్రితం జొమాటో పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లింది. అది సూపర్‌ హిట్‌ అయ్యింది. షేర్లు నమోదైన తొలిరోజే 66 శాతం ప్రతిఫలాన్ని ఇవ్వడమే కాక.. కంపెనీ మార్కెట్‌ విలువ లక్ష కోట్ల రూపాయల మైలు తాకింది. ఈరోజు విజయ పథంలో దూసుకుపోతున్న జొమాటో అసలు ఎలా ప్రారంభం అయ్యింది అనే దాని వేనక ఓ ఆసక్తికర కథనం ఉంది. ఆ వివరాలు జొమాటో వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్‌ గోయల్‌ మాటల్లోనే.. 

‘‘నేను ఐఐటీలో చదువుతున్నప్పుడు ఆన్‌లైనలో పిజ్జా ఆర్డర్‌ చేసేవాడిని. కానీ అది ఎప్పుడు నాకు నచ్చేది కాదు. ఓ సారి లేట్‌ అయితే.. మరోసారి నాకు నచ్చిన పిజ్జా దొరికేది కాదు. ఐఐటీలో ఉన్నన్ని రోజులు ఈ సమస్యను ఎదుర్కొన్నాను. చదువు పూర్తయిన తర్వాత బైన్‌ కంపెనీలో చేరాను. అక్కడ నా సహోద్యుగులు క్యాంటిన్‌లో లభించే పరిమిత ఆహారం పట్ల అసంతృప్తిగా ఉండేవారు’’ అని దీపిందర్‌ గుర్తు చేసుకున్నారు. 

‘‘క్యాంటీన్‌లో తక్కువ ఐట్సం ఉండేవి. దగ్గర్లోని రెస్టారెంట్‌కు వెళ్దామంటే కుదిరేది కాదు. దీని గురించి ఆలోచిస్తున్న సమయంలో నే నాకు పంకజ్‌ చద్దాతో పరిచయం ఏర్పడింది. ఇద్దరం దీని గురించి ఆలోచించి.. ఓ మార్గం కనుకొన్నాము. మా కంపెనీ పక్కనే ఉన్న కేఫ్స్‌, రెస్టారెంట్‌ మెనుని కంపెనీ ఇంటర్నెట్‌లోకి ఫోన్‌ నంబర్లతో అప్‌లోడ్‌ చేశాం. ఫుడీబే.కామ్‌ పేరుతో వీకెండ్‌ వెంచర్‌గా నడిపాం. ఇది బాగా క్లిక్‌ అయ్యింది. జాబ్‌ చేస్తూనే దీన్ని చూసుకునేవాళ్లం’’ అని తెలిపారు గోయల్‌. 

‘‘ఈ క్రమంలో నా భార్యకు ఢిల్లీ యూనివర్శిటీలో జాబ్‌ వచ్చింది. దాంతో నా ఉద్యోగానికి రాజీనామా చేసి.. పూర్తి దృష్టి దీని మీదనే పెట్టాను. వెంచర్‌ని విస్తరించే ప్రయత్నాలు ప్రారంభించాను. మొదట దీని గురించి నా తల్లిదండ్రులతో సహా ఎవ్వరికి చెప్పలేదు. ఏడాదిలోపే దేశంలోని ఆరు ప్రముఖ నగరాల్లోని వేల కొద్ది రెస్టారెంట్లు మా స్టార్టప్‌లో లిస్ట్‌ అయ్యాయి’’ అని చెప్పుకొచ్చారు. 

టొమాటో స్ఫూర్తితో జొమాటో..
‘‘స్టార్టప్‌ అభివృద్ధి అవుతున్న క్రమంలో దాని పేరు మార్చాలని భావించాం. కొత్తగా, వినూత్నంగా, కస్టమర్లకు బాగా గుర్తుండే పేరు కోసం ఆలోచించాం. అప్పుడు టొమాటో తట్టింది. భారతీయ వంటకాల్లో టొమాటో తప్పనిసరి. మా యాప్‌ కూడా అలానే అభివృద్ధి చెందాలని భావించి టొమాటో స్ఫూర్తితో జొమాటో అని పేరు పెట్టాం’’ అని దీపిందర్‌ తెలిపారు. 

ప్రస్తుతం భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్‌లలో ఒకటైన జొమాటో అంతర్జాతీయ విస్తరణకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా టర్కీ, బ్రెజిల్‌, న్యూజిలాండ్‌, ఇండోనేషియా సహా 19 దేశాల్లో సేవలందిస్తుంది. టేబుల్‌ బుకింగ్స్‌, హోమ్‌ డెలివరీ, రెస్టారెంట్‌, నైట్‌లైప్‌ గైడ్లలోకి ప్రవేశించి.. ముందుకు సాగుతుంది. ప్రస్తుతం ఈ కంపెనీలో 5,500 మంది పైచిలుకు మంది పని చేస్తున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top