జోమాటో కీలక నిర్ణయం..! ఇకపై

Zomato Announces Plans To Launch Online Grocery Delivery Service On Its App Soon - Sakshi

ముంబై: ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జోమాటో కీలక నిర్ణయం తీసుకుంది. జోమాటో త్వరలో ఆన్‌లైన్ కిరాణా డెలివరీ సేవలను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు కంపెనీ గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించింది. గత ఏడాది ఏప్రిల్‌లో జోమాటో ప్రారంభంలో  80 కి పైగా నగరాల్లో తొలిసారిగా కిరాణా డెలివరీ సేవలను ప్రారంభించగా..దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో గ్రాసరీ డెలివరీ సేవలు నిలిచిపోయాయి. ప్రస్తుతం జోమాటో తిరిగి ఆన్‌లైన్‌ కిరాణా డెలివరీ సేవలను పునరుద్దరిస్తున్నట్లు కంపెనీ  తెలిపింది. 

జోమాటో జూలై 14 నుంచి ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపిఓ) ప్రారంభించటానికి ముందే ఆన్‌లైన్ కిరాణా డెలివరీలో అడుగుపెట్టాలని జోమాటో తాజా ప్రకటన చేసింది. జోమాటో రూ. 9,375 కోట్లను సమీకరించాలని భావిస్తోంది . జోమాటో షేర్ల తాజా ఇష్యూ రూ. 72 నుంచి 76 చొప్పున ఉండనున్నట్లు తెలుస్తోంది జోమాటో స్థానిక కిరాణా రిటైలర్లను భాగస్వామిగా చేసుకునే విషయంపై సందిగ్ధత నెలకొంది. జోమాటో  ఈ నెల ప్రారంభంలో ఆన్‌లైన్ కిరాణా డెలివరీ ప్లాట్‌ఫామ్ గ్రోఫర్స్‌లో 10 శాతం మైనారిటీ వాటాను సొంతం చేసుకోవాలని ఆశించింది.   గ్రోఫర్స్లో 100 మిలియన్ డాలర్లను  (సుమారు రూ. 747 కోట్లు) వాటాను జోమాటో ప్రకటించింది.

గ్రోఫర్స్‌లో పెట్టుబడులు పెట్టినప్పటికీ, జోమాటో తన సొంత ప్రణాళికలతో కిరాణా డెలివరీ సేవలను ప్రారంభిస్తోందని  జోమాటో సిఎఫ్ఓ అక్షంత్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. కిరాణా డెలివరీలలో జోమాటో తిరిగి రావడం తన సమీప ప్రత్యర్థి స్విగ్గీకి కఠినమైన పోటీని ఇవ్వగలదు, స్విగ్గీ కూడా ఇన్‌స్టామార్ట్‌తో డెలివరీ సేవలను అందిస్తోంది. అంతేకాకుంగా బిగ్‌ బాస్కెట్‌ వంటి గ్రాసరీ సేవలను అందించే సంస్థలకు జోమాటో పోటీగా నిలవనుంది. కాగా బిగ్‌బాస్కెట్‌ తన వ్యాపారాన్ని మరింత పెంచుకోవడానికి టాటా డిజిటల్‌ నుంచి సుమారు రూ. 9,500 కోట్లను సమీకరించింది.

కోవిడ్‌ రాకతో పుంజుకున్న ఆన్‌లైన్‌ గ్రాసరీ డెలివరీ...
కోవిడ్‌-19 రాకతో వినియోగదారులు ఎక్కువగా ఆన్‌లైన్‌ గ్రాసరీ డెలివరీల వైపు మొగ్గుచూపారు. రెడ్‌సీర్ కన్సల్టింగ్ సంస్థ నివేదిక ప్రకారం.. భారత్‌లో ఆన్‌లైన్ కిరాణా మార్కెట్ 2025 నాటికి స్థూల వస్తువుల విలువ (జిఎమ్‌వి) 24 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,79,400 కోట్లు) ఉంటుందని అంచనా వేసింది.దేశంలో ఫుడ్‌ అండ్‌ గ్రాసరీ వాటాలో ఈ-కామర్స్‌ ఏడుశాతానికి  చేరింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top