Income Tax: డిడక్షన్లు కొనసాగుతాయా.. | Old Deductions Continue Under New Tax Law, Old Vs New Regime Choice Still Key For Taxpayers, More Details Inside | Sakshi
Sakshi News home page

Income Tax: డిడక్షన్లు కొనసాగుతాయా..

May 4 2026 11:01 AM | Updated on May 4 2026 11:27 AM

Will Your Tax Deductions Continue Understanding New Sections Forms

కొత్త చట్టం. కొత్త రూల్సు, కొత్త ఫారాలు. కొత్త ఆర్థిక సంవత్సరం. గత ఆర్థిక సంవత్సరం వరకు అమల్లో ఉన్న డిడక్షన్లు కొనసాగుతాయా? ఈ సంవత్సరం క్లెయిం చేసుకోవచ్చా? పాత చట్టంతో పాటు అవి కూడా పోతాయా? చాలా మంది ట్యాక్స్‌ పేయర్లు ఇలాంటి సందేహాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా అడుగుతున్నారు. ఒక మాటలో, సుందరకాండలో హనుమంతుడు చెప్పినట్లు చెప్పాలంటే, ‘కొనసాగుతాయి’ అని చెప్పాలి. ఇక వివరాల్లోకి వెళితే..

పాత చట్టం, అంటే 1961 చట్టంలోని అంశాలు అన్నింటినీ యధాతథంగా కొనసాగించారు. భాష మారింది. సెక్షన్ల అంకెలు మారాయి. చెప్పవలసిన సందర్భం మారింది. అంతే కాని, అంశాలు, వాటి ఉద్దేశం, పరిమితులు, ఉప పరిమితులు, ఆంక్షలు, షరతులు, వర్తించే నియమావళి మారలేదు. ఒకప్పుడు చాప్టర్‌  VI-Aలో పొందుపర్చిన అంశాలను వేరొకచోట, సెక్షన్ల నంబర్లు మార్చి, వరుసగా, మరింత సరళమైన భాషతో, భావంతో మరింత నిర్మాణాత్మకంగా విశదీకరించారు.

పాత సంవత్సరంలో అసెస్సీలకు, అంటే, మీకు, మనందరికి, ఇన్‌కం ట్యాక్స్‌ చెల్లించడానికి రెండు ఆప్షన్లు ఇచ్చారు. పాత పద్ధతిలో సెక్షన్‌ 80సి, 80డి, 80ఈ మొదలైన సెక్షన్ల ప్రకారం డిడక్షన్లు ఇచ్చారు. బేసిక్‌ లిమిట్‌ .. వయస్సును బట్టి ఉంది. రేట్లు 10 శాతం, 20 శాతం, 30 శాతం.

కొత్త పద్ధతిలో ఎటువంటి డిడక్షన్లు ఇవ్వడం లేదు. బేసిక్‌ లిమిట్‌ ఎవరికైనా రూ. 3,00,000తో మొదలుపెట్టి రూ. 4,00,000కు పెంచారు. ప్రతి శ్లాబ్‌ను రూ. 4,00,000 చొప్పున పెంచారు. రేట్లు 5%, 10%, 15%, 20%, 25% తర్వాత 30%. ఇలా ఉంటుండగా ‘రిబేటు’ పేరిట పెద్ద రిలీఫ్‌ ఇచ్చి రూ. 12,75,000 ఆదాయం వరకు ఉద్యోగస్తులకు, ఇతరులకేమో రూ. 12,00,000 వరకు ఎటువంటి పన్నుభారం లేకుండా చేశారు. కొత్త పద్ధతిలో మీరు ఎటువంటి సేవింగ్స్‌ చేయనక్కర్లేదు. ఏమీ ఇన్వెస్ట్‌మెంట్‌ చేయనక్కర్లేదు. అంటే నగదు.. నగదంటే.. నగదు కాదు.. బ్యాంకు ద్వారా ఎటువంటి విధంగా బైటకు వెళ్లడం (ఔట్‌ఫ్లో) ఉండక్కర్లేదు. అంటే మీ చేతిలో ‘సర్‌ప్లస్‌’ ఉంటుంది. పాత పద్ధతిలో రూ. 10,00,000 నికర ఆదాయం దాటితే 30 శాతం వర్తిస్తుంది. కొత్త పద్ధతిలో రూ. 24,00,000 దాటితే 30 శాతం వర్తిస్తుంది.  

పైన చెప్పినదంతా మీకు ఇదివరకు తెలిసిందే. కొత్త అంశాలు లేవు. వీటిని యధాతథంగా కొత్త చట్టంలోకి తెచ్చారు. వాటికి అనుగుణంగా అనుసంధానం చేస్తూ రూల్సు, ఫారాలు మార్చారు. మీకు ఎన్నో సంవత్సరాలుగా పరిచయం ఉన్న సెక్షన్‌ 80సి ఇప్పుడు కొత్త చట్టంలో 123గా మారింది. అలాగే మరో సెక్షన్‌ 80డి ఇప్పుడు 127గా చలామణీలోకి వచి్చంది. ఇలాగే మిగతా అన్ని డిడక్షన్లు.  
కొత్త చట్టంలోనూ, కొత్త రూల్స్‌ ప్రకారం, కొత్త ఫారాల అమల్లో అదే సమస్య.. కాదు..కాదు.. అదే పరిస్థితి. రెండు రకాల ఆప్షన్లు. మీరు నిర్ణయించుకోవాల్సినది.. దేన్ని ఎంచుకోవాలని. పాతదా కొత్తదా.. గతంలో ఎన్నోసార్లు ఎన్నెన్నో ఉదాహరణలు ఇచ్చి వివరించాము. ఒక వ్యూహంతో నిర్ణయం తీసుకోవాలి. ఈ నిర్ణయం తీసుకోవడానికి కొన్ని సలహాలు.

కేవలం పన్నుభారం తగ్గే దిశలో ఆలోచిస్తే .. 
ఏదో ఒక కారణం వల్ల ప్రావిడెంట్‌ ఫండ్‌కి కాంట్రిబ్యూషన్‌ కంపల్సరీ. పిల్లలు చదువుకుంటున్నారు. ఫీజులు చెల్లించాలి. మెడికల్‌ అత్యవసరం లేదా కంపల్సరీ. ఇలాంటి సందర్భాల్లో మీరు మీ ఖాతా నుంచి ఖర్చు పెట్టక తప్పదు. నగదు బైటకు వెళ్లడం తప్పదు. ఇన్‌కం ట్యాక్స్‌ చట్టంతో సంబంధం లేకుండా ఖర్చు తప్పదు. అప్పుడు పాత పద్ధతిని ఎంచుకోండి. డిడక్షన్‌ క్లెయిమ్‌ చేయండి. మరొక పరిస్థితి. సేవింగ్స్‌ అవసరం లేదు. పిల్లలకు ఫీజులు కట్టక్కర్లేదు. అనారోగ్య భయం లేదు. అటువంటప్పుడు కొత్త పద్ధతిని ఎంచుకోండి.  

పన్నుయేతర అంశాలకు ప్రాధాన్యం ఇచ్చి నిర్ణయం తీసుకోవాలంటే.. 
పాత పద్ధతిలో ప్రతి డిడక్షన్‌కి కాగితాలు, రుజువులు ఉండాలి. వివరణ ఇవ్వాలి. కొత్త పద్ధతిలో ఎటువంటి కాగితాల్లాంటివి అవసరం లేదు.

ఇతర అంశాలు.. 
సులభతరం కాబట్టి, యువతరం కొత్త పద్ధతివైపు మొగ్గు చూపుతున్నారు. వృద్ధులు జాగ్రత్తపరులుగా ఉండి, పాత పద్ధతివైపు వెళ్తున్నారు. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలి. గడువు తేదీ దాటితే పాతపద్ధతిలో వేయలేరు. యజమానికి ముందుగా చెప్పాలి. వ్యాపారస్తులు, వృత్తి నిపుణులకు మారి్పడి విషయంలో ఆంక్షలు ఉన్నాయి.  
ఆలోచించుకుని సరైన నిర్ణయం తీసుకోండి.

Advertisement
 
Advertisement
Advertisement