
స్వీడన్‌కు చెందిన వోల్వో కార్స్ ఖర్చు ఆదా ప్రణాళికలో భాగంగా సుమారు 3,000 ఆఫీస్ ఉద్యోగాలను తొలగించాలని నిర్ణయించింది. కంపెనీ పెరుగుతున్న ఖర్చులు, ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) బలహీనమైన డిమాండ్, వాణిజ్య అనిశ్చితిని ఎదుర్కొంటున్నట్లు రాయిటర్స్ తెలిపింది. ఈ నేపథ్యంలో సంస్థ లేఆఫ్స్‌కు సంబంధించిన నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
కంపెనీ మాజీ సీఈఓ హకన్ శామ్యూల్సన్ తిరిగి వోల్వోకు నాయకత్వ బాధ్యతలు చేపట్టిన కొన్ని వారాల్లోనే ఈమేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కంపెనీ చేసే దాదాపు 18 బిలియన్ స్వీడిష్ క్రౌన్లు (సుమారు 1.9 బిలియన్ డాలర్లు) తగ్గించే ప్రణాళికలను సీఈఓ ఏప్రిల్‌లో ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం లేఆఫ్స్ నిర్ణయం తీసుకున్నట్లు రాయిటర్స్ తెలిపింది. కంపెనీ మొత్తం సిబ్బందిలో 40 శాతం వాటా కలిగిన వైట్ కాలర్ ఉద్యోగులకు లేఆఫ్స్ ఇవ్వడం ద్వారా ఖర్చు తగ్గించుకోవాలని కంపెనీ యోచిస్తున్నట్లు పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థకు యూరప్‌లో 29,000 మంది, ఆసియాలో 10,000 మంది, అమెరికాలో 3,000 మంది ఉద్యోగులు ఉన్నారు. తాజాగా ప్రకటించిన లేఆఫ్స్ రీసెర్చ్, హ్యూమన్ రిసోర్సెస్, కమ్యూనికేషన్ వంటి వివిధ విభాగాల్లో ఉంటాయని శామ్యూల్సన్ తెలిపారు. వోల్వో కార్ కొత్త ఫైనాన్స్ చీఫ్ ఫ్రెడ్రిక్ హాన్సన్ మాట్లాడుతూ.. ఈ లేఆఫ్స్ వల్ల వ్యాపారం తాత్కాలికంగా ప్రభావితం చెందినా భవిష్యత్తులో మెరుగ్గా ఉంటుందని చెప్పారు. ఉద్యోగ తొలగింపులు ఎక్కువగా స్వీడన్‌లోని గోథెన్ బర్గ్‌లో ఉంటాయని చెప్పారు.
ఇదీ చదవండి: ముఖేశ్ భాయ్ ట్రేడింగ్ చేశారా..?
వోల్వో కార్స్ ప్రకారం.. దాదాపు 15% కార్యాలయ ఉద్యోగులను తొలగించనున్నారు. ఈ చర్య వల్ల కంపెనీపై 1.5 బిలియన్ క్రౌన్ల భారం పడుతుందని భావిస్తున్నారు. అయితే, ఈ ఇది దాని నిర్మాణాన్ని మరింత సమర్థవంతంగా చేయడానికి సహాయపడుతుందని కంపెనీ భావిస్తోంది.