ఎయిర్‌ ట్యాక్సీ...రూ.12కే విమాన ప్రయాణం..! | We will bring Evitol by 2025 says Kanika Tekriwal Reddy | Sakshi
Sakshi News home page

ఎయిర్‌ ట్యాక్సీ...రూ.12కే విమాన ప్రయాణం..!

Mar 25 2022 5:55 AM | Updated on Mar 25 2022 10:19 AM

We will bring Evitol by 2025 says Kanika Tekriwal Reddy - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కిలోమీటరుకు రూ.12 చార్జీ. అదీ ఎయిర్‌ ట్యాక్సీలో. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. ఎలక్ట్రిక్‌ వర్టికల్‌ టేక్‌–ఆఫ్‌ అండ్‌ ల్యాండింగ్‌ (ఈవీటోల్‌) ఎయిర్‌క్రాఫ్ట్స్‌తో ఇది సాధ్యమని జెట్‌ సెట్‌ గో చెబుతోంది. అద్దెకు ప్రైవేట్‌ విమానాలను నడుపుతున్న ఈ సంస్థ ఈవీటోల్‌ ఎయిర్‌క్రాఫ్ట్స్‌ ద్వారా ఎయిర్‌ ట్యాక్సీ రంగంలోకి రావాలని కృతనిశ్చయంతో ఉంది.

ఇందుకోసం రెండు తయారీ సంస్థలతో మాట్లాడుతున్నామని జెట్‌ సెట్‌ గో ఏవియేషన్‌ సర్వీసెస్‌ ఫౌండర్‌ కనిక టేక్రివాల్‌ రెడ్డి వెల్లడించారు. తొలుత హైదరాబాద్, ఆ తర్వాత ముంబై, బెంగళూరులో ఎయిర్‌ ట్యాక్సీ సేవలు పరిచయం చేస్తామన్నారు. బేగంపేట విమానాశ్రయంలో గురువారం ప్రారంభమైన వింగ్స్‌ ఇండియా–2022 సందర్భంగా ఆమె సాక్షి బిజినెస్‌ బ్యూరోతో మాట్లాడారు. ఎయిర్‌ ట్యాక్సీ, కంపెనీ, పరిశ్రమ గురించి ఆమె మాటల్లో..   

మూడేళ్లలో సాకారం..  
ప్రపంచవ్యాప్తంగా 12 సంస్థలు ఈవీటోల్‌ ఎయిర్‌క్రాఫ్ట్స్‌ తయారీలో ఉన్నాయి. వీటిని నడపడానికి పైలట్‌ అవసరం లేదు. పైకి లేచినప్పుడు, కిందకు దిగేప్పుడు నిటారుగా ప్రయాణిస్తాయి. ల్యాండింగ్, టేకాఫ్‌ కోసం ల్యాండింగ్‌ ప్యాడ్స్‌ అవసరం. ఒక్కో ట్యాక్సీలో నలుగురు ప్రయాణించవచ్చు. ఒకసారి చార్జింగ్‌తో 40 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. కిలోమీటరుకు అయ్యే చార్జీ రూ.12 మాత్రమే. ఈవీటోల్‌ ఎయిర్‌క్రాఫ్ట్స్‌ ఖరీదు సుమారు రూ.23 లక్షలు ఉంటుంది. ఎయిర్‌ ట్యాక్సీ సేవలను మూడేళ్లలో సాకారం చేస్తాం. ల్యాండింగ్‌ ప్యాడ్‌ 8 మీటర్ల పొడవు, 8 మీటర్ల వెడల్పు ఉంటే చాలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరం. తొలి దశలో ఈ ప్రాజెక్టు కోసం రూ.1,900 కోట్లు ఖర్చు చేస్తాం.  

ఏవియేషన్‌ సెంటర్‌..
ప్రైవేట్‌ రంగంలో దేశంలో తొలి ఏవియేషన్‌ సెంటర్‌ హైదరాబాద్‌లో రూ.30 కోట్ల ఖర్చుతో మే నాటికి ఏర్పాటు చేస్తున్నాం. ప్రైవేట్‌ జెట్స్‌ పరిశ్రమకు అవసరమైన మానవ వనరులను ఈ కేంద్రం అందిస్తుంది. ప్రస్తుతం జెట్‌ సెట్‌ గో వద్ద 22 జెట్స్, 2 హెలికాప్టర్స్‌ ఉన్నాయి. 80 మంది పైలట్లు ఉన్నా రు. కొత్తగా ఈ ఏడాది నాలుగు జెట్స్, ఒక హెలికాప్టర్‌ జతకూడనున్నాయి. అద్దె గంటకు రూ.1.3 లక్షల నుంచి ప్రారంభం. 120 దేశాల్లోని 600లకుపైగా విమానాశ్రయాల్లో అడుగుపెట్టాం. రోజుకు సగటున 75 ల్యాండింగ్స్‌ నమోదు చేస్తున్నాం. రెండు నెలల్లో రూ.1,520 కోట్లు సమీకరిస్తున్నాం.  

తొలి స్థానంలో హైదరాబాద్‌..
ప్రైవేట్‌ జెట్స్‌ రాకపోకల విషయంలో దేశంలో భాగ్యనగరి తొలి స్థానంలో ఉంది. బేగంపేట విమానాశ్రయంలో కోవిడ్‌కు ముందు సగటున రోజుకు 2–3 ప్రైవేట్‌ జెట్స్‌ ల్యాండ్‌ అయ్యేవి. ఇప్పుడు 15 అవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ సంఖ్య 250. భారత్‌లో ప్రైవేట్‌ వ్యక్తులు, కంపెనీల వద్ద 95 జెట్స్, హెలికాప్టర్స్‌ ఉన్నాయి. వీటిలో 7 తెలుగు రాష్ట్రాల వారివి. మా కంపెనీకి తెలంగాణ ప్రధాన మార్కెట్‌. విమానాలను పక్షులు ఢీకొట్టిన సంఘటనలు హైదరాబాద్‌లో నెలకు 15 వరకు ఉండగా, దేశవ్యాప్తంగా ఈ సంఖ్య నెలకు 1–2 మాత్రమే. రిపేర్‌కు రూ.15–23 కోట్ల ఖర్చు అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement