
అనంత్ అంబానీ నిర్వహిస్తున్న వన్యప్రాణి సంరక్షణ, పునరావాస కేంద్రం వంతారాలో సంరక్షిస్తున్న మాధురి అనే ఏనుగును తిరిగి కొల్హాపూర్‌కు తరలించే ప్రయత్నాలకు తాము పూర్తిగా సహకరిస్తామని గుజరాత్‌ని జంతు సంరక్షణ కేంద్రం వంతారా తెలిపింది. కోర్టు ఆదేశాల మేరకే ఆ ఏనుగును వంతారాకు తీసుకొచ్చామని, ఇందులో తమ ప్రమేయమేమీ లేదని వంతారా మరోసారి స్పష్టం చేసింది.
పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్ మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) పిటిషన్ ఆధారంగా బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు గత నెలలో మాధురి ఏనుగును కొల్హాపూర్ లోని నందిని మఠం నుంచి జామ్ నగర్ లోని వంతరా కేంద్రానికి తరలించారు. స్థానికులు మాధురి ఏనుగును పవిత్రంగా భావించే కొల్హాపూర్ లో ఈ నిర్ణయంపై నిరసనలు వెల్లువెత్తాయి. అనంతరం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. దీంతో ఈ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వం మరోసారి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తాజాగా చెప్పారు. దీనిపై స్పందించిన వంతరా ఒక ప్రకటన విడుదల చేసింది.

మాధురిని కొల్హాపూర్ కు తిరిగి రప్పించాలని కోరుతూ జైన మఠం, మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు వంతరా పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపింది. సుప్రీం కోర్టు అనుమతికి లోబడి మాధురి ఏనుగును సురక్షితంగా, గౌరవప్రదంగా తిరిగి కొల్హాపూర్‌కు తరలించడానికి పూర్తి సాంకేతిక, పశువైద్య సహాయాన్ని అందిస్తుందని పేర్కొంది. అంతేకాకుండా దీర్ఘకాలిక పరిష్కారంగా కొల్హాపూర్ లో మాధురి కోసం శాటిలైట్ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటును వంతరా ప్రతిపాదించింది. మఠం, మహారాష్ట్ర ప్రభుత్వం, జంతు సంక్షేమ నిపుణుల సహకారంతో ఈ కొత్త సదుపాయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపింది. మఠం అధిపతి, రాష్ట్ర అధికారులతో చర్చించి భూమిని ఎంపిక చేస్తామని, అనుమతులు రాగానే పనులు ప్రారంభించేందుకు తమ బృందం సిద్ధంగా ఉందని వంతరా తెలిసింది.

ప్రతిపాదిత కేంద్రంలో కల్పించే సౌకర్యాలు
హైడ్రోథెరపీ పాండ్, స్విమ్మింగ్ ప్రాంతం
లేజర్ థెరపీ గదులు, పునరావాస ప్రదేశాలు
నైట్ షెల్టర్, గొలుసులు లేని భారీ బయలు ప్రదేశం
సహజ ప్రవర్తన, ఆట కోసం ఇసుక గుంట
24/ 7 సంరక్షణ కోసం పూర్తిస్థాయి సౌకర్యాలతో పశువైద్యశాల
కీళ్ల నొప్పులు,పాదాల కుళ్లడం వంటి వాటి నుంచి ఉపశమనం, విశ్రాంతి కోసం మృదువైన రబ్బరు ఫ్లోర్లు, ఇసుక దిబ్బలు
