Union Budget 2023-24: కొత్త పన్ను విధానం ఆకర్షణీయం

Union Budget 2023-24: New tax regime sweetened to benefit maximum number of taxpayers - Sakshi

తక్కువ పన్ను రేటు

ఎక్కువ మందికి ప్రయోజనకరం

నచ్చిన విధానం ఎంచుకోవచ్చు

సీబీడీటీ చైర్మన్‌ నితిన్‌గుప్తా

న్యూఢిల్లీ: నూతన పన్ను విధానం 2023–24 బడ్జెట్‌తో ఆకర్షణీయంగా మారినట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చైర్మన్‌ నితిన్‌ గుప్తా తెలిపారు. ఎక్కువ మంది ఇన్వెస్టర్లకు ఇది ప్రయోజనకరమని, తక్కువ పన్ను రేటును వారు ఆస్వాదిస్తారని చెప్పారు. బడ్జెట్‌ అనంతరం ఓ వార్తా సంస్థతో గుప్తా మాట్లాడారు. తగ్గింపులు, మినహాయింపులను క్రమంగా దూరం చేయడం కోసమే నూతన పన్ను విధానంలో (మినహాయింపుల్లేని) కొత్త శ్లాబులు, రేట్లు ప్రకటించడానికి కారణంగా పేర్కొన్నారు. దీని ద్వారా వ్యక్తులు, సంస్థలపై పన్ను రేట్లు తగ్గించాలన్న దీర్ఘకాలిక డిమాండ్‌ను చేరుకోవడం సాధ్యపడుతుందన్నారు.

‘‘నూతన పన్ను విధానాన్ని రెండేళ్ల క్రితం (2020–21 బడ్జెట్‌లో) ప్రతిపాదించాం. అయినప్పటికీ తగిన ప్రతిఫలాన్ని ఇవ్వడం లేదు. ఇప్పుడు ప్రభుత్వం శ్లాబులను మార్చింది. దీనివల్ల పన్ను చెల్లింపుదారులకు రేట్లు, శ్లాబులు ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతాయి’’అని చెప్పారు. కార్పొరేట్‌ విభాగంలో పన్ను చెల్లింపుదారులకు ఇదే మాదిరి చర్యలను కొంత కాలం క్రితం ప్రకటించగా, వారికి ప్రయోజనకరంగా మారినట్టు గుప్తా తెలిపారు. నూతన పన్ను విధానంతో లబ్ధి పొందని వర్గాలు చాలా తక్కువన్నారు. దీనిలో స్టాండర్డ్‌ డిడక్షన్‌ కల్పించినందున, అది పాత విధానంలోని ప్రయోజనాలకు ఏ మాత్రం తీసిపోదన్నారు.

పన్ను చెల్లింపు దారుల ఇష్టమే..
నూతన పన్ను విధానం డిఫాల్ట్‌ (ప్రమేయం లేని)గా ఉంటున్నందున, పాత పన్ను విధానంలో ఉన్నవారిపై ప్రభావం పడుతుందా? అన్న ప్రశ్నకు.. ఏ విధానం అయినా ఎంపిక చేసుకుని రిటర్నులు దాఖలు చేసే స్వేచ్ఛ పన్ను చెల్లింపుదారులకు ఉంటుందని నితిన్‌గుప్తా చెప్పారు. కావాలంటే పాత పన్ను విధానానికి కూడా మారిపోవచ్చన్నారు. ‘‘డిఫాల్ట్‌ అంటే ఫైలింగ్‌ పోర్టల్‌ స్క్రీన్‌పై ముందు కనిపిస్తుంది. కానీ, అక్కడ ఏ పన్ను విధానం అనే ఆప్షన్‌ ఉంటుంది. కావాల్సిన విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చు’’అని గుప్తా వివరించారు.

ఏ వర్గం పన్ను చెల్లింపుదారులను కూడా నిరుత్సాహపరచబోమన్నారు. నూతన పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు పన్ను చెల్లించే అవకాశం లేకుండా రిబేట్‌ కల్పించడం తెలిసిందే. దీనికి అదనంగా రూ.50 వేల స్టాండర్డ్‌ డిడక్షన్‌ ప్రయోజనం కూడా ప్రకటించారు. పాత విధానంలో అయితే రూ.5 లక్షలకు మించిన ఆదాయంపై 20% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే వివిధ సెక్షన్ల కింద తగిన సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది.

అంతిమంగా కొత్త విధానమే
తక్కువ పన్ను రేట్లతో, మినహాయింపుల్లేని, సులభతర పన్నుల విధానానికి (నూతన పన్ను విధానం) మళ్లడమే ప్రభుత్వ ధ్యేయమని కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ విభాగం కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రా తెలిపారు. రెవెన్యూ శాఖ నిర్వహించిన విశ్లేషణ ప్రకారం ఏటా రూ.15 లక్షలు ఆర్జించే వ్యక్తి పాత పన్ను విధానంలో రూ.3.75 లక్షల వరకు క్లెయిమ్‌లు పొందొచ్చని.. కానీ, తక్కువ పన్ను రేట్లతో దీనికి ప్రత్యామ్నాయ పన్నుల విధానాన్ని ప్రతిపాదించినట్టు చెప్పారు. నూతన పన్ను విధానం తప్పనిసరి చేయడానికి ఎలాంటి గడువు పెట్టుకోలేదని స్పష్టం చేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top