యూనియన్‌ బ్యాంకు.. భేష్‌

Union Bank of India September Quarter Net Profit Sees 183percent Rise - Sakshi

నికర లాభం రూ.1,520 కోట్లకు వృద్ధి

మెరుగు పడిన ఆస్తుల నాణ్యత

ముంబై: ప్రభుత్వరంగంలోని యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా సెప్టెంబర్‌ క్వార్టర్‌కు ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ లాభం 183 శాతం పెరిగి రూ.1,510 కోట్లుగా నమోదైంది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఖాతాకు సంబంధించి గతంలో మాఫీ చేసిన రుణం రికవరీ కావడం మెరుగైన ఫలితాలకు దోహదపడింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.534 కోట్లుగానే ఉంది. నికర వడ్డీ ఆదాయం 9 శాతం పెరిగి రూ.6,829 కోట్లుగా ఉంది. నికర వడ్డీ మార్జిన్‌ 2.78 శాతం నుంచి 2.95 శాతానికి పుంజుకుంది. రుణాల్లో 3 శాతం వృద్ధిని సాధించింది. వడ్డీయేతర ఆదాయం 65 శాతం పెరిగి రూ.3,978 కోట్లుగా నమోదైంది. ఇందులో మాఫీ చేసిన రుణం తాలూ కు వసూలైన రూ.1,764 కోట్లు కూడా ఉంది.

8 శాతం రుణ వృద్ధి లక్ష్యం  
మొత్తం మీద సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.5,341 కోట్ల మేర రుణాల రికవరీని సాధించినట్టు యూనియన్‌ బ్యాంకు ఎండీ, సీఈవో రాజ్‌కిరణ్‌ రాయ్‌ ఫలితాల సందర్భంగా ప్రకటించారు. రిటైల్, వ్యవసాయ రుణాల్లో మంచి వృద్ధి కనిపిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి రుణాల్లో 8 శాతం వృద్ధిని సాధించాలన్న లక్ష్యంతో ఉన్నట్టు తెలిపారు. స్థూల ఎన్‌పీఏలు (వసూలు కాని రుణాలు) ఏడాది క్రితం ఇదే కాలంలో ఉన్న 14.71 శాతం నుంచి 12.64 శాతానికి తగ్గాయి. సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.6,745 కోట్ల రుణాలు ఎన్‌పీఏలుగా మారాయి. ఇందులో రూ. 2,600 కోట్లు శ్రేయీ గ్రూపు కంపెనీలవే ఉన్నాయి. ఈ ఖాతాలకు ఇప్పటికే 65 శాతం కేటాయింపులు చేసినట్టు రాజ్‌కిరణ్‌ రాయ్‌ తెలిపారు. ఎన్‌పీఏలకు కేటాయింపులు రూ.3,273 కోట్లకు తగ్గాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top