ఈవీ కంపెనీల నిధుల వేట

TVS Motor Company makes fresh investment in Ultraviolette - Sakshi

200 మిలియన్‌ డాలర్ల సమీకరణలో బౌన్స్‌

1.5 మిలియన్‌ డాలర్లు

సమీకరించిన ఒబెన్‌ ఈవీ

అల్ట్రావయొలెట్‌లో టీవీఎస్‌ మోటార్‌ మరిన్ని పెట్టుబడులు

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్, ప్రోత్సాహం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ–వాహనాల కంపెనీలు నిధులు సమకూర్చుకోవడంపై మరింతగా కసరత్తు చేస్తున్నాయి. తాజాగా ఎలక్ట్రిక్‌ బైక్‌ల తయారీ సంస్థ అల్ట్రావయొలెట్‌ ఆటోమోటివ్‌లో ద్విచక్ర వాహనాల దిగ్గజం టీవీఎస్‌ మోటార్స్‌ మరిన్ని పెట్టుబడులు పెట్టింది. జోహో కార్పొరేషన్‌తో కలిసి ఇన్వెస్ట్‌ చేసినట్లు తెలిపింది. అయితే, పెట్టుబడి పరిమాణాన్ని వెల్లడించలేదు.

భారీ సామర్థ్యం ఉండే ఎలక్ట్రిక్‌ మోటార్‌సైకిల్‌ ఎఫ్‌77 తయారీ, విక్రయాలకు ఈ నిధులను అల్ట్రావయొలెట్‌ ఉపయోగించుకోనుంది. బెంగళూరులోని ఎలక్ట్రానిక్స్‌ సిటీలో అల్ట్రావయొలెట్‌ తమ తయారీ, అసెంబ్లింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఎఫ్‌77 బైక్‌ల తొలి బ్యాచ్‌ను వచ్చే ఏడాది ప్రథమార్ధంలో మార్కెట్లో ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఉంది.
 
మరోవైపు, బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న మొబిలిటీ సేవల సంస్థ బౌన్స్‌ కూడా భారీ ఎత్తున నిధులను సమీకరిస్తోంది. ’బౌన్స్‌ ఇన్ఫినిటీ ఈ1’ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ తయారీకి సంబంధించి మరో 200 మిలియన్‌ డాలర్లు సమకూర్చుకోవాలని యోచిస్తోంది. బౌన్స్‌ ఇప్పటిదాకా యాక్సెల్, సెకోయా, బి క్యాపిటల్‌ గ్రూప్‌ వంటి ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థల నుంచి 220 మిలియన్‌ డాలర్ల దాకా పెట్టుబడులు దక్కించుకుంది.

ఈ ఏడాదే దాదాపు 7 మిలియన్‌ డాలర్లు వెచ్చించి 22మోటార్స్‌ సంస్థలో 100 శాతం వాటాలు కొనుగోలు చేసింది. దీనితో రాజస్తాన్‌లోని భివాడీలో ఉన్న అధునాతన తయారీ ప్లాంటు కంపెనీ చేతికి వచ్చింది. ఇందులో వార్షికంగా 1,80,000 స్కూటర్లను ఉత్పత్తి చేయొచ్చు. దేశీయంగా ఎలక్ట్రిక్‌ వాహనాలకు పెరగబోయే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని దక్షిణ భారతదేశంలో దాదాపు 5,00,000 వాహనాల తయారీ సామర్థ్యంతో మరో ప్లాంటును కూడా ఏర్పాటు చేయాలనే యోచనలో బౌన్స్‌ ఉంది. ఇందుకోసం వచ్చే ఏడాది వ్యవధిలో ఎలక్ట్రిక్‌ వాహనాల వ్యాపారం కోసం 100 మిలియన్‌ డాలర్లను పక్కన పెట్టింది.

ఒబెన్‌లో ఉయ్‌ ఫౌండర్‌ సర్కిల్‌ ఇన్వెస్ట్‌మెంట్లు
అటు ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల స్టార్టప్‌ సంస్థ ఒబెన్‌ ఈవీ 1.5 మిలియన్‌ డాలర్ల నిధులు సమకూర్చుకుంది. ప్రారంభ దశ సంస్థల్లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్ల గ్రూప్‌ అయిన ఉయ్‌ ఫౌండర్‌ సర్కిల్‌తో పాటు లైఫ్‌ ఎలిమెంట్‌ కో–ఫౌండర్‌ రాకేశ్‌ సొమానీ, ప్రముఖ ఏంజెల్‌ ఇన్వెస్టర్లు సుమీత్‌ పాఠక్, మిలన్‌ మోదీ తదితరులు ఈ విడత ఇన్వెస్ట్‌ చేశారు. తమ బైక్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు, కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేసేందుకు, ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లను విస్తరించేందుకు ఒబెన్‌ ఈ నిధులు వినియోగించుకోనుంది. ఒక్కసారి చార్జి చేస్తే 200 కి.మీ. దాకా ప్రయాణించగలిగే ఎలక్ట్రిక్‌ బైక్‌ను తయారు చేసే ప్రయత్నాల్లో ఒబెన్‌ ఉంది. దీని టాప్‌ స్పీడ్‌ గంటకు 100 కి.మీ.లుగా ఉంటుంది. వచ్చే రెండేళ్లలో వివిధ విభాగాల్లో నాలుగు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ చెబుతోంది. మరో ఆరు నెలల్లో తొలి ఉత్పత్తిని ఆవిష్కరించనున్నట్లు సంస్థ వివరించింది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top