
టెల్కోలకు ట్రాయ్ ఆదేశాలు
న్యూఢిల్లీ: స్పామ్ కాల్స్ చేసే టెలీమార్కెటర్లపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కఠిన చర్యలు ప్రకటించింది. అన్‌రిజిస్టర్డ్ టెలీ మార్కెటింగ్ సంస్థలు వ్యాపారపరమైన స్పామ్ కాల్స్ చేస్తున్నట్లుగా తేలినట్లయితే వాటి టెలికం వనరులన్నింటినీ డిస్కనెక్ట్ చేయాలని, రెండేళ్ల పాటు వాటిని బ్లాక్‌లిస్ట్‌లో ఉంచాలని టెల్కోలను ఆదేశించింది. బ్లాక్‌లిస్ట్‌లో ఉంచినప్పుడు ఆయా సంస్థలకు కొత్తగా టెలికం వనరులను కేటాయించరాదని పేర్కొంది.
ఎస్‌ఐపీ, పీఆర్‌ఐ వంటి టెలికం వనరులను ఉపయోగిస్తున్న అన్‌రిజిస్టర్డ్ టెలీమార్కెటర్లు ఈ ఆదేశాలు వచ్చిన నెల రోజుల్లోగా డీఎల్‌టీ ప్లాట్‌ఫాంనకు మారాలని తెలిపింది. ఈ ఆదేశాలను తక్షణం పాటించాలని, ఈ విషయంలో తీసుకున్న చర్యలపై ప్రతి పదిహేను రోజులకు ఓసారి (ప్రతి నెలా ఒకటి, పదహారో తారీఖుల్లో) అప్‌డేట్ ఇవ్వాలని టెల్కోలకు ట్రాయ్ సూచించింది. ఈ ‘నిర్ణయాత్మక చర్య‘తో స్పామ్ కాల్స్ బెడద గణనీయంగా తగ్గగలదని, వినియోగదారులకు ఉపశమనం కలగగలదని అభిప్రాయపడింది.