యూరప్‌ మార్కెట్‌పై హేమాహేమీల కన్ను

Tesla Elon Musk Giving Tough Competition To Volkswagen In Europe market - Sakshi

ఎప్పటి నుంచో ఆటోమొబైల్‌ ఇండస్ట్రీ అంటే జర్మనీ పెట్టింది పేరు. అలాంటి జర్మనీలో మళ్లీ ఫోక్స్‌వ్యాగన్‌దే ఆధిపత్యం. ఫోక్స్‌వ్యాగన్‌ బ్రాండ్‌కి తోడు పోర్షే, స్కోడా, లంబోర్గిని, ఆడి వంటి అనేక బ్రాండ్లు ఈ కంపెనీ సొంతం. అలాంటి దిగ్గజ కంపెనీకి జర్మనీ గడ్డ మీదనే సవాల్‌ విసిరారు బిజినెస్‌ ఫైర్‌బ్రాండ్‌ ఎలన్‌మస్క్‌.

గిగా ఫ్యాక్టరీ కాన్సెప్టుతో మాన్యుఫ్యాక్చరింగ్‌ సెక్టార్‌కి కొత్త రూపు తీసుకొచ్చారు ఎలన్‌ మస్క్‌. భారీ పెట్టుబడితో అతి భారీగా తయారీ పరిశ్రమను నెలకొల్పి ప్రొడక‌్షన్‌ వ్యయం తగ్గించేయడం ఈ గిగా ఫ్యాక్టరీల లక్ష్యం. అలాంటి ఫ్యాక్టరీ తాజాగా జర్మనీలో ప్రారంభించారు ఎలన్‌ మస్క్‌. జర్మనీ ఛాన్సలర్‌ ఓలాఫ్‌ షూల్జ్‌ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

సుమారు 12 వేల మంది కార్మికులు పని చేస్తున్న ఈ ఫ్యాక్టరీ జర్మనీలోనే పెద్దదిగా రికార్డు సృష్టించింది. ఈ ఫ్యాక్టరీ మీద 5.5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టారు ఎలన్‌ మస్క్‌. రాబోయే రోజుల్లో ఏడాదికి ఐదు లక్షల కార్లు తయారు చేయడం ఈ గిగా ఫ్యాక్టరీ లక్ష్యం.

ప్రస్తుతం యూరప్‌ మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌ వెహికల్‌ సెగ్మెంట్‌లో ఫోక్స్‌ వ్యాగన్‌దే ఆధిపత్యం. యూరప్‌లో 25 శాతం మార్కెట్‌తో ఏడాదికి 4.50 లక్షల ఈవీ కార్లను విక్రయిస్తోంది ఫోక్స్‌ వ్యాగన్‌. ఇప్పటికిప్పుడు ఆ కంపెనీ చేతిలో 95 వేల ఈవీ కార్ల ఆర్డర్లు రెడీగా ఉన్నాయి.

ఎలన్‌ మస్క్‌ ప్రారంభించి టెస్లా గిగా ఫ్యాక్టరీతో రాబోయే రెండుమూడేళ్లలో ఫోక్స్‌వ్యాగన్‌కి తీవ్రమైన పోటీ ఎదురు కానుంది. యూరప్‌ మార్కెట్‌లో టెస్లాకి 13 శాతం మార్కెట్‌ వాటా ఉంది. ఇక కొత్తగా గిగా ఫ్యాక్టరీ కూడా అందుబాటులోకి వస్తే మార్కెట్‌లో టెస్లా మరింత దూకుడు ప్రదర్శిస్తుంది. దీంతో జర్మన్‌ పీపుల్స్‌ కార్ల కంపెనీకి ఇబ్బందులు తప్పేలా లేవు.

గిగా ఫ్యాక్టరీ ప్రారంభమైనప్పటికీ 2022 ఏడాదికి సంబంధించి ఉత్పత్తి సామర్థ్యం 54 వేల కార్లుగానే ఉండనుంది. 2023లో 2.80 లక్షల ఉత్పత్తి చేసి 2025 కల్లా ఏడాదికి 5 లక్షల కార్ల ఉత్పత్తి సామర్యం చేరుకోవాలని టెస్లా లక్ష్యంగా పెట్టుకుంది. టెస్లా దూకుడుకి చెక్‌ పెట్టే పనిలో భాగంగా ఫోక్స్‌వ్యాగన్‌ సైతం తన ఉత్పత్తి సామర్థ్యం పెంచుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు రెండు బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయనుంది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top