టెక్‌ సంస్థలకు జవాబుదారీతనం ఉండాలి

Tech companies like Facebook and Google accountable to the societies - Sakshi

దీనిపై ప్రపంచ దేశాలు సహకరించుకోవాలి

వాక్‌స్వాతంత్య్రానికి ప్రభుత్వం వ్యతిరేకం కాదు

నాస్కామ్‌ సదస్సులో కేంద్ర మంత్రి చంద్రశేఖర్‌ స్పష్టీకరణ

న్యూఢిల్లీ: ఫేస్‌బుక్, గూగుల్‌ వంటి బడా టెక్‌ కంపెనీలు.. సమాజం పట్ల జవాబుదారీతనంతో ఉండేలా చూసేందుకు ప్రపంచ దేశాలన్నీ కలిసి రావాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ చెప్పారు. ఈ దిశగా భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను.. వాక్‌ స్వాతంత్య్రానికి వ్యతిరేకమైనవిగా ప్రచారం చేయరాదని ఆయన స్పష్టం చేశారు. ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్‌ నిర్వహించిన వార్షిక ఎన్‌టీఎల్‌ఎఫ్‌ (నాస్కామ్‌ టెక్నాలజీ అండ్‌ లీడర్‌షిప్‌ ప్రోగ్రాం) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చంద్రశేఖర్‌ ఈ విషయాలు తెలిపారు.

దేశీయంగా పరిస్థితుల రీత్యా అభ్యంతరమైన కంటెంట్‌ను తొలగించాలంటూ యూట్యూబ్, ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాలను ప్రభుత్వం ఇటీవల తరచుగా ఆదేశిస్తుండటాన్ని.. వాక్‌స్వాతంత్య్రంపై దాడిగా కొన్ని వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘బడా టెక్‌ కంపెనీలు, టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌లు తాము సర్వీసులు అందించే సమాజం, వర్గాల పట్ల మరింత జవాబుదారీతనంతో వ్యవహరించేలా చూడాలంటే, దేశాలు పరస్పరం సహకరించుకోవాలి‘ అని చంద్రశేఖర్‌ చెప్పారు. సైబర్‌ నేరాలు, సైబర్‌భద్రత తదితర అంశాల్లో పాటించాల్సిన నియంత్రణపరమైన సూత్రాలను రూపొందించుకోవాలని పేర్కొన్నారు.  

డేటా భద్రత బిల్లుకు మరింత సమయం..
డేటా భద్రత బిల్లును ప్రవేశపెట్టడంపై జాప్యం జరిగే అవకాశం ఉందని మంత్రి ఈ సందర్భంగా సూచనప్రాయంగా తెలిపారు. దీనిపై హడావుడిగా చట్టం చేసి ఆ తర్వాత సవరణలు చేస్తూ పోయే యోచన ప్రభుత్వానికి లేదని మంత్రి స్పష్టం చేశారు. ఈ బిల్లుకు మద్దతుగా, వ్యతిరేకంగా భారీ స్థాయిలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని, అనేక సలహాలు.. సూచనలు కూడా వస్తున్నాయని ఆయన తెలిపారు. వీటన్నింటిపై చర్చలు కొనసాగుతున్నాయని వివరించారు.

గోప్యతకి సంబంధించిన ఆందోళనలపై స్పందిస్తూ.. భద్రత, నమ్మకం, జవాబుదారీతనం, స్వేచ్ఛ మొదలైనవన్నీ పరస్పర విరుద్ధమైన సూత్రాలని.. సౌలభ్యాన్ని బట్టి ఎంచుకోవడం మారుతూ ఉంటుందని చంద్రశేఖర్‌ చెప్పారు. అయితే, ప్రభుత్వ విధానాల రీత్యా భద్రత, నమ్మకం అత్యంత ముఖ్యమైనవిగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ‘దేశాన్ని డిజిటైజ్‌ చేయడం ఎంత ముఖ్యమో, మన ప్రజాస్వామ్యాన్ని సురక్షితంగా ఉంచుకోవడం .. వినియోగించే టెక్నాలజీ విశ్వసనీయమైనదిగా, జవాబుదారీతనంతో కూడుకున్నదై ఉండేలా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం‘ అని మంత్రి అభిప్రాయపడ్డారు.

55 వేలకు పైగా ఫ్రెషర్ల హైరింగ్‌: ఇన్ఫీ
దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా భారీగా నియామకాలు చేపట్టనుంది. సుమారు 55,000 మంది పైచిలుకు ఫ్రెషర్లను నియమించుకునే యోచనలో ఉంది. ఎన్‌టీఎల్‌ఎఫ్‌లో పాల్గొన్న సందర్భంగా కంపెనీ సీఈవో సలిల్‌ పరేఖ్‌ ఈ విషయాలు తెలిపారు. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కాలేజ్‌ గ్రాడ్యుయేట్ల నియామకాలు 55,000 స్థాయిలో ఉంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా ఇదే స్థాయిలో లేదా ఇంతకన్నా ఎక్కువే రిక్రూట్‌ చేసుకుంటాం‘ అని వివరించారు. ఇంజినీరింగ్, సైన్స్‌ గ్రాడ్యుయేట్లకు టెక్నాలజీ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని పరేఖ్‌ తెలిపారు.

ఆవిష్కరణలపై కంపెనీలు దృష్టి పెట్టాలి: విప్రో సీఈవో థియెరీ
కొత్త ఆవిష్కరణలను రూపొందించడంపై కంపెనీలు మరింతగా కసరత్తు చేయాలని ఎన్‌టీఎల్‌ఎఫ్‌ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విప్రో సీఈవో థియెరీ టెలాపోర్ట్‌ అభిప్రాయపడ్డారు. ఈ టెక్నాలజీ దశాబ్దంలో మరింత సమర్ధత పెంచుకోవడం, బాధ్యతాయుతంగా పనిచేయడంపై దృష్టి పెట్టడంతో పాటు ప్రతిభావంతులను అట్టే పెట్టుకునేలా తమ విధానాలను సవరించుకోవాలని సూచించారు. అన్ని పరిశ్రమలు, మార్కెట్లలోని సంస్థలు తమ వ్యాపార సమస్యలను పరిష్కరించుకునేందుకు డిజిటల్‌ బాట పడుతున్నాయని, రాబోయే సంవత్సరాల్లో ఈ ధోరణి మరింతగా పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top